మిషిగన్‌ స్పీకర్‌గా రంజీవ్‌ పూరి!  | Ranjeev Puri elected as first Indian-American Speaker of Michigan House | Sakshi
Sakshi News home page

మిషిగన్‌ స్పీకర్‌గా రంజీవ్‌ పూరి! 

Nov 7 2026 6:34 AM | Updated on Nov 7 2026 6:34 AM

Ranjeev Puri elected as first Indian-American Speaker of Michigan House

తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డు 

మూడుసార్లు అసెంబ్లీకి, తాజాగా స్పీకర్‌ స్థానానికి 

వాషింగ్టన్‌: అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున రంజీవ్‌ పూరి ఎన్నికయ్యారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. ‘‘ఈ రోజు సహచరుల ద్వారా మిషిగన్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక కావడంతో నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. నాపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు. 

ఎంతో ఉత్సాహంగా అసలు పని మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను’’అని రంజీవ్‌ తన సంతోషాన్ని ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా వ్యక్తం చేశారు. నవంబర్‌ మూడున జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 42 ఏళ్ల రంజీవ్‌ పూరి మిషిగన్‌ హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌ (రాష్ట్ర అసెంబ్లీ)కి ఎన్నికయ్యారు. 

ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మిషిగన్‌ నుంచి సెనేట్‌ మెజార్టీ నేతగా ఎన్నికైన డారిన్‌ కామిల్లిరి, గవర్నర్‌గా ఎన్నికైన జోస్లిన్‌ బెన్సన్‌లతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు రంజీవ్‌ తెలిపారు. 

2020లో రంజీవ్‌ పూరి మిషిగన్‌ అసెంబ్లీకి ఎన్నికైన తొలి సిక్కు అమెరికన్‌గా ఎన్నికయ్యారు. 2020లో మిషిగన్‌లోని డిస్టిక్ట్‌ 21 నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించగా.. 2022, 2024, 2026లలో డి్రస్టిక్ట్‌ 24 నుంచి వరుసగా ఎన్నికైన ఘనత రంజీవ్‌ పూరిది.  

పంజాబ్‌ నుంచి వలస వెళ్లిన తల్లిదండ్రులకు అమెరికాలోనే జన్మించిన రంజీవ్‌ను 2025లో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న 110 మంది సభ్యులున్న అసెంబ్లీకి డెమొక్రటిక్‌ పార్టీ నేతగా నియమించారు. ‘‘మా తల్లిదండ్రులు ఈ దేశానికి వలస వచ్చినప్పుడు కొడుకు ఈ స్థాయికి ఎదిగి చరిత్ర సృష్టిస్తాడని ఊహించి ఉండరు. అడ్డంకులను చెరిపేయడం, మిషిగన్‌ అసెంబ్లీకి స్పీకర్‌గా మారడం... ఇదంతా అమెరికా ఇచ్చే నమ్మకం’’అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement