పూజా సేథీ రికార్డు విజయం | first Indian-American woman Pooja Sethi elected to the Texas Legislatur | Sakshi
Sakshi News home page

పూజా సేథీ రికార్డు విజయం

Nov 7 2026 6:29 AM | Updated on Nov 7 2026 6:29 AM

first Indian-American woman Pooja Sethi elected to the Texas Legislatur

టెక్సస్‌ అసెంబ్లీకి ఎన్నిక

ఆస్టిన్‌ (టెక్సస్‌): అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల విజయ పరంపర కొనసాగుతోంది. నవంబరు మూడున ఎన్నికలు జరగ్గా ఫలితాలు వస్తున్న కొద్దీ కీలక స్థానాలకు ఎన్నికైన భారతీయ అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారతీయ అమెరికన్‌ పూజా సేథీ టెక్సస్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. డిస్ట్రిక్ట్‌ 47 నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పూజాకు దాదాపు 66 శాతం ఓట్లు దక్కడం ఒక రికార్డు.

 టెక్సస్‌ అసెంబ్లీకి భారతీయ అమెరికన్, అసియా అమెరికన్‌ డెమోక్రటిక్‌ మహిళ ఎన్నికవడం ఇదే మొదటిసారి కావడం ఇంకో రికార్డు. వాస్తవానికి పూజా సేథీకి రాజకీయాలు కొత్తేమీ కాదు. నాలుగేళ్లుగా టెక్సస్‌ రాష్ట్ర ప్రతినిధి విక్కీ గుడ్‌విన్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. చట్టాలు డ్రాఫ్ట్‌ చేయడమే కాకుండా.. ప్రజా ప్రతినిధులకు సలహా సూచనలు ఇస్తూండేవారు. ఈ సారి మధ్యంతర ఎన్నికల్లో తెర వెనుకనే ఉండిపోకుండా ముందుకు వచ్చారు. 

రెండో తరం భారతీయ అమెరికన్‌ అయిన పూజా సేథీకి భారతీయ మూలాలతోనూ గట్టి సంబంధాలే కలిగి ఉంది. భారతీయ అమెరికన్ల ఓటర్ల నమోదు కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉండేది. ఇండియన్‌ కొయలేషన్‌ ఆఫ్‌ సెంట్ర్‌ టెక్సస్‌కు గతంలో అధ్యక్షులుగానూ పనిచేశారు. తుపాకీ సంస్కృతిని తగ్గించడం, విద్యకు ప్రభుత్వ సహకారం పెంచడం, టెక్సస్‌లో పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై తన గళం వినిపించారు.

 సైరాకూస్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి న్యాయశాస్త్ర పట్టభద్రురాలైన పూజా సేథీ చాలాకాలం పాటు ఇమ్మిగ్రేషన్‌ అటారీ్నగా పనిచేశారు. తరువాతి కాలంలో ‘ఇమ్మిగ్రేషన్‌ ఫర్‌ ఆల్‌’అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. సొంతంగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. ట్రావిస్‌ కౌంటీ డెమోక్రాటిక్‌ పార్టీ ఛెయిర్‌గానూ వ్యవహరించారు. 2026 ఎన్నికల్లో వక్కీ గుడ్‌విన్‌ పోటీ చేయడం లేదని ప్రకటించడంతో పూజా ఆ స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.  

వివక్షను ఎదుర్కొంటూ.. 
ఎన్నికల ప్రచారం పూజాకు ఏమంత తేలికగా నడవలేదు. వలసదారులపై ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వచ్చింది. భారతీయ వారసత్వాన్ని వెక్కిరిస్తూ ఆన్‌లైన్‌ ట్రోల్స్‌ నడిచాయి. అయితే పూజా వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొవడమే కాకుండా... ‘‘నా వారసత్వం నాకు అవమానం కానేకాదు. అది నా గాథ’అని ధైర్యంగా ప్రకటించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. 

లక్షలాది అమెరికన్ల మాదిరిగా తానూ కష్టపడ్డానని, ఈ దేశంపై విశ్వాసం ఉంచానని, సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నానని తన ప్రచారంలో స్పష్టం చేశారు. ఈ మెసేజ్‌ కాస్తా ఓటర్లలోకి చొచ్చుకుపోవడంతో రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసిన జెన్నిఫర్‌ ముష్‌టేలర్‌పై ఘన విజయం సాధించారు. విజయం తరువాత పూజ మాట్లాడుతూ ‘‘చరిత్ర సృష్టించడం ఒక గౌరవం. మార్పు తీసుకురావడం బాధ్యత’’అని స్పష్టం చేశారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement