ఈ మధ్య భర్తలను భార్యలు చంపేస్తున్న ఉదంతాలు ఎక్కువయ్యాయి. భారత్‌లోనే కాదు.. వేరే దేశాల్లోనూ భర్తల ప్రాణాలకు రక్షణ ఉండటం లేదు!! ఇలాగే ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సాయంతో భర్త హత్యకు ప్రయత్నించిన ఉదంతం అమెరికాలో వెలుగులోకి వచ్చింది.
అమెరికాలో కృత్రిమ మేధ (AI) చాట్‌బాట్ చాట్‌జీపీటీ చుట్టూ మరో వివాదం మొదలైంది. తనను హత్య చేసేందుకు తన భార్యకు చాట్‌జీపీటీ సహకరించిందని ఆరోపిస్తూ నార్త్ కరోలినాకు చెందిన జేమ్స్ గేట్స్ అనే వ్యక్తి చాట్‌జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్‌ఏఐపై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను కూడా ప్రతివాదిగా చేర్చారు. శాన్‌ఫ్రాన్సిస్కో కౌంటీ సుపీరియర్ కోర్టులో ఈ దావా దాఖలైంది.
జేమ్స్ గేట్స్ ఆరోపణల ప్రకారం.. తన భార్య చెరిల్ గేట్స్ తొలుత తన వృత్తిపరమైన పనులు, ఇంటి అవసరాల కోసం చాట్‌జీపీటీని ఉపయోగించేవారు. అనంతరం దంపతుల మధ్య విభేదాలు, విడాకుల చర్చలు మొదలవడంతో వైవాహిక సమస్యల గురించి కూడా చాట్‌బాట్‌తో మాట్లాడటం ప్రారంభించారు. ఈ క్రమంలో చాట్‌జీపీటీ ఆమె అనుమానాలను మరింత పెంచుతూ, భర్తపై అపనమ్మకాన్ని ప్రోత్సహించిందని జేమ్స్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఓలియాండర్ (గన్నేరు) విషపూరిత లక్షణాలు, కొన్ని ఔషధాల ప్రభావాలు, వాటిని గుర్తించకుండా ఎలా కలపవచ్చనే అంశాలపై చాట్‌జీపీటీ సమాచారం అందించిందని ఆరోపించారు. విషప్రయోగం జరిగితే శవపరీక్షలో గుర్తించగలరా అనే ప్రశ్నకు కూడా చాట్‌బాట్ సమాధానమిచ్చినట్లు దావాలో పొందుపరిచిన స్క్రీన్‌షాట్ల ద్వారా వెల్లడించారు.
చేతిరాత నోట్‌తో బయటపడిన వ్యవహారం
2025లో అనారోగ్యానికి గురైన జేమ్స్‌కు గుండె సంబంధిత లక్షణాలు, తీవ్రమైన కడుపునొప్పి, బలహీనత, గందరగోళం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌లో భార్య చేతిరాతతో ఉన్న ఓ నోట్‌ను గుర్తించినట్లు తెలిపారు. అందులో కొన్ని పదార్థాలు, వాటి మోతాదులతోపాటు 'అన్ని సంభాషణలను తొలగించాలి', 'చాట్‌జీపీటీ నుంచి లాగ్‌అవుట్ కావాలి' అనే సూచనలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై 2025లో చెరిల్‌పై హత్యాయత్నం, ఆహారంలో విషపదార్థాలు కలిపేందుకు ప్రయత్నించారనే అభియోగాలు నమోదయ్యాయి. అయితే తగిన ఆధారాలు లేవంటూ ప్రాసిక్యూటర్లు 2026 ఏప్రిల్‌లో ఆమెపై క్రిమినల్ కేసును ఉపసంహరించుకున్నారు.
ఓపెన్‌ఏఐ ఏమంటోంది?
చాట్‌జీపీటీ ప్రమాదకరమైన సమాచారాన్ని అందించకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని జేమ్స్ తన దావాలో ఆరోపించారు. మరోవైపు, ఈ వ్యవహారంపై స్పందించిన ఓపెన్‌ఏఐ.. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపింది. సంబంధిత వినియోగదారు ఖాతాను నిషేధించామని, దర్యాప్తులో భాగంగా పోలీసులకు సమాచారాన్ని అందించామని వెల్లడించింది.
ఇప్పటికే చాట్‌బాట్‌ల వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు, హింసాత్మక చర్యలకు ప్రోత్సాహం వంటి అంశాలపై పలు సంస్థలు, బాధిత కుటుంబాలు చట్టపరమైన పోరాటం చేస్తున్నాయి. తాజాగా జేమ్స్ గేట్స్ దావా కూడా ఈ జాబితాలో చేరింది.
ఇదీ చదవండి: లక్ష మందికి గుడ్ న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ


