నిరుద్యోగినంటూనే నెలకు రూ.10 వేలు ఈఎంఐ చెల్లింపు | Jobless Husband Pays Rs 10000 Car EMI : Orissa High Court Orders | Sakshi
Sakshi News home page

నిరుద్యోగినంటూనే నెలకు రూ.10 వేలు ఈఎంఐ చెల్లింపు

Nov 6 2026 11:31 AM | Updated on Nov 6 2026 11:45 AM

Jobless Husband Pays Rs 10000 Car EMI : Orissa High Court Orders

హైకోర్టు తీవ్ర అసంతృప్తి

న్యాయస్థానాల్లో భరణం కేసుల విచారణ సమయంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమ ఆదాయాన్ని దాచిపెట్టే ధోరణిపై ఒరిస్సా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాను ఉద్యోగం కోల్పోయానని, తండ్రి పెన్షన్‌పైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నానని ఒక భర్త వాదించినప్పటికీ కోర్టు దాన్ని తోసిపుచ్చింది. నెలకు రూ.10,000 చొప్పున కారు ఈఎంఐలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వ్యక్తికి నిజమైన ఆర్థిక స్థోమత లేదన్న వాదనను అంగీకరించలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకున్న భార్యకు శాశ్వత భరణం కింద రూ.10 లక్షలు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కేసు నేపథ్యం

ఈ వివాదంలో భర్త తొలుత ఒక ఇన్సూరెన్స్ సంస్థలో నెలకు సుమారు రూ.30,000 జీతంతో ఉద్యోగం చేసేవాడు. అయితే, కెరీర్‌ను మార్చుకునే ఉద్దేశంతో (లా ప్రాక్టీస్ కోసం) 2024 మే నెలలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆయన హైకోర్టులో తెలిపారు. తనకు ఎలాంటి స్వతంత్ర ఆదాయం లేదని, వృద్ధులైన తల్లిదండ్రుల వద్దే ఉంటూ వారి పెన్షన్‌పై బతుకుతున్నానని వాదించారు. భార్య కోరిన రూ.15 లక్షల భరణాన్ని చెల్లించే ఆర్థిక సామర్థ్యం తనకు లేదని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

అయితే, న్యాయమూర్తి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ధర్మాసనం ఈ వాదనలను నిశితంగా పరిశీలించింది. నిరుద్యోగినని చెప్పుకుంటున్న సదరు వ్యక్తి క్రమం తప్పకుండా నెలకు సుమారు రూ. 10,000 చొప్పున కారు ఈఎంఐలను ఎలా చెల్లించగలుగుతున్నాడని కోర్టు నిలదీసింది. ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక వివరాలు పూర్తిగా అతని వ్యక్తిగత పరిజ్ఞానంలోనే ఉంటాయని, నిజమైన ఆదాయాన్ని దాచిపెట్టి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే ప్రతికూల అనుమానాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

తీర్పులోని ముఖ్యాంశాలు

ఉద్యోగం లేదని చెబుతూనే విలాసవంతమైన ఖర్చులు, కారు ఈఎంఐలు చెల్లించడం వెనుక గల వాస్తవ ఆర్థిక పరిస్థితులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దంపతుల మధ్య వివాహ బంధం కొనసాగిన కాలం, ఇతర వాస్తవిక పరిస్థితులను బేరీజు వేసిన న్యాయస్థానం భార్య జీవన భృతికి రూ.10 లక్షల మొత్తం న్యాయమైనదిగా నిర్ణయించింది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. భర్త ఇప్పటికే రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వద్ద డిపాజిట్ చేసిన రూ.5 లక్షలను ఈ మొత్తం నుంచి సర్దుబాటు చేయనుండగా మిగిలిన రూ.5 లక్షలను నిర్ణీత గడువులోగా చెల్లించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఇవి కొంటే మీ బ్యాడ్‌లక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement