సాధారణంగా కంపెనీల్లో ఉద్యోగులకు జీతాలు, బోనస్‌లు ఇస్తుంటారు. కానీ.. కొందరు యజమానులు మాత్రం తమ ఉద్యోగులను సంతోషపెట్టడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఇలాగే ఆలోచించారు.. యూఏఈలో ఓ కంపెనీకి చెందిన మహిళా మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్. తన కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కొత్త ఐఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనించినట్లయితే.. మహిళా ఉద్యోగులందరూ కాన్ఫరెన్స్ రూమ్‌కు రావడం చూడవచ్చు. అక్కడ ఉద్యోగులు కుర్చీలను వెనక్కి లాగి కూర్చోబోయే సమయంలో వారికి ఓ సర్‌ప్రైజ్ కనిపించింది. ప్రతి కుర్చీలోనూ అందంగా ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్సులు ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి చూస్తే.. కొత్త ఐఫోన్లు కనిపించాయి. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒక్కొక్కరు తమ గిఫ్ట్‌ను చూసుకుంటూ ఆశ్చర్యంతో నవ్వులు చిందించారు.
అయితే ఈ వీడియోలో అందరినీ ఎక్కువగా ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే.. కంపెనీలో పనిచేసే హౌస్‌కీపింగ్ సిబ్బందిని కూడా హసీనా అంతే ఆప్యాయంగా చూసుకున్నారు. ఓ మహిళా హౌస్‌కీపింగ్ ఉద్యోగి హసీనాకు షర్బత్ అందిస్తున్న సమయంలో ఆమెకు కూడా కొత్త ఐఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అసలు ఊహించని ఈ గిఫ్ట్ చూసి ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. హసీనాను గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సన్నివేశం వీడియోలో అందరినీ కదిలిస్తోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హసీనా.. ప్రతి మహిళకు ఎన్నో కలలు, బాధ్యతలు, సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ కలలను నిజం చేసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒక మహిళ విజయం సాధిస్తే, ఆమెను చూసి మరో మహిళ కూడా జీవితంలో ముందుకు వెళ్లడానికి ధైర్యం పొందుతుందని చెప్పారు. మరో మహిళ ఎదుగుదలను చూడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని వెల్లడించారు.
ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి కాదు. గతంలో సెప్టెంబర్ 24న కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు హసీనా భర్త, కంపెనీ యజమాని నిషాద్ హుస్సేన్ ఉద్యోగులకు ఐఫోన్లను బహుమతిగా ఇచ్చారు. ఆ వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ రెండు వీడియోలు చూసిన నెటిజన్లు హసీనా దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదీ చదవండి: అందుకే బంగారం, బిట్‌కాయిన్ కొంటున్నా.. కియోసాకి వ్యూహం ఇదే!
నిజానికి ఉద్యోగులకు ఐఫోన్లు ఇవ్వడం ఒక ఖరీదైన బహుమతే. కానీ అంతకంటే ముఖ్యమైనది ఉద్యోగుల పట్ల చూపించిన గౌరవం, అభిమానం. కంపెనీలో తమ స్థాయి ఏదైనా సరే, ప్రతి ఒక్కరినీ సమానంగా చూసినప్పుడే ఉద్యోగుల్లో ఆత్మీయత, నమ్మకం పెరుగుతాయి. హసీనా చేసిన ఈ పని ఇప్పుడు అందరికీ అదే విషయాన్ని గుర్తుచేస్తోంది.


