లక్కీ ఉద్యోగులు వీళ్లే.. టాప్‌ దీపావళి గిఫ్ట్స్‌ ఇవే.. | Diwali 2026 Gifts Companies Surprise Employees With Cars Bikes Flats | Sakshi
Sakshi News home page

లక్కీ ఉద్యోగులు వీళ్లే.. టాప్‌ దీపావళి గిఫ్ట్స్‌ ఇవే..

Nov 2 2026 8:03 PM | Updated on Nov 2 2026 8:18 PM

Diwali 2026 Gifts Companies Surprise Employees With Cars Bikes Flats

దీపావళి వచ్చిందంటే ఉద్యోగులకు బోనస్‌లు, స్వీట్లు, బహుమతులు అందించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే కొన్ని సంస్థలు తమ సిబ్బంది కృషి, అంకితభావాన్ని గుర్తిస్తూ ఖరీదైన కానుకలు అందిస్తున్నాయి. కార్లు, బైక్‌లు, ఫ్లాట్లు, ఆభరణాలతో ఉద్యోగులను ఆశ్చర్యపరిచిన వ్యాపార సంస్థల బహుమతులు ఏటా వార్తల్లో నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఈ కథనంలో చూద్దాం..

కియా సోనెట్ ఎస్‌యూవీలు

ఈ ఏడాది దీపావళికి ముందు హరియాణాలోని పంచకుల కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐటీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నలుగురు ఉద్యోగులకు కియా సోనెట్‌ ఎస్‌యూవీలను బహుమతిగా ఇచ్చింది. సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ ఎంకే భాటియా.. ఉద్యోగుల పనితీరు, సంస్థ పట్ల విధేయతకు గుర్తింపుగా ఈ కానుకలు అందించారు. గతంలోనూ ఉద్యోగులకు కార్లు అందించిన ఈ సంస్థ, ఈసారి కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.

కార్లు, బైక్‌లు..

2024లో చెన్నైకి చెందిన టీమ్‌ డిటైలింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ సుమారు 30 మంది ఉద్యోగులకు కార్లు, ద్విచక్ర వాహనాలను బహుమతిగా ఇచ్చింది. ఈ కానుకల విలువ దాదాపు రూ.3.5 కోట్లు. ఇన్నోవా, క్రెటా, ఐ20, మెర్సిడెస్‌ బెంజ్‌ వంటి కార్లతో పాటు బైకులు, స్కూటర్లు అందించి ఉద్యోగుల పనితీరును అభినందించింది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు

2023లో తమిళనాడులోని కోటగిరికి చెందిన టీ ఎస్టేట్‌ యజమాని పి. శివకుమార్‌ 15 మంది ఉద్యోగులకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, జావా మోటార్‌సైకిళ్లను బహుమతిగా ఇచ్చారు. ఉద్యోగులు తమకు నచ్చిన మోడళ్లను ఎంచుకునే అవకాశం కల్పించారు. ఒక్కో బైకు విలువ రూ.2 లక్షలకు పైగా ఉండటం విశేషం.

చెన్నై జ్యువెలరీ సంస్థ ఇచ్చినవి..

2022లో చెన్నైకి చెందిన చల్లాని జ్యువెలరీ యజమాని జయంతి లాల్‌ చయంతి తన ఉద్యోగులకు 8 కార్లు, 18 బైకులు అందించారు. ఈ బహుమతుల మొత్తం విలువ సుమారు రూ.1.2 కోట్లు. కరోనా సమయంలోనూ సంస్థకు అండగా నిలిచిన ఉద్యోగులను గుర్తించి ఈ కానుకలు ఇచ్చారు.

సావ్జీ ధోలాకియా బహుమతులు ప్రత్యేకం

సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారవేత్త సావ్జీ ధోలాకియా దీపావళి బహుమతులతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2016లో తన హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ ఉద్యోగులకు 1,260 కార్లు, 400 ఫ్లాట్లు అందించారు. 2018లో మరో 600 కార్లను బహుమతిగా ఇచ్చారు. ఆ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొందరు ఉద్యోగులకు కారు తాళాలు అందజేశారు.

ఇలా పండుగ వేళ ఉద్యోగులను ప్రోత్సహించే ఈ కానుకలు కేవలం బహుమతులుగానే కాకుండా, సంస్థ పట్ల వారి నిబద్ధతకు ఇచ్చే గుర్తింపుగా నిలుస్తున్నాయి.

ఇదీ చదవండి: తులం బంగారానికి కేజీ వెండి? తగ్గుతోన్న తేడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement