దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కార్బన్ (Karbonn) మళ్లీ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. రెబెల్ 5జీ, రెబెల్ ప్రో పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలు అమెజాన్ ఇండియా మైక్రోసైట్‌లో ఇప్పటికే వెల్లడయ్యాయి. 2021లో కార్బన్ ఎక్స్21ను విడుదల చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ విభాగంలో పెద్దగా కనిపించని ఈ సంస్థ.. కొత్త రెబెల్ సిరీస్‌తో తిరిగి వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది.
రెబెల్ 5జీ ఫీచర్లు
కార్బన్ రెబెల్ 5జీలో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 650 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇందులో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. 18 వాట్ల యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంటుంది. బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
రెబెల్ ప్రోలో 120Hz డిస్‌ప్లే
రెబెల్ ప్రోలో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20W ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. బ్లూ, బర్గుండీ, గోల్డ్, గ్రే రంగుల్లో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది.
ఆండ్రాయిడ్ 16తో క్లీన్ సాఫ్ట్‌వేర్
రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, రెండేళ్ల భద్రతా నవీకరణలను అందిస్తామని కార్బన్ హామీ ఇచ్చింది. ముందుగా ఇన్‌స్టాల్ చేసిన అనవసర యాప్‌లు లేకుండా క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించనున్నట్లు తెలిపింది. బాక్స్‌లో ఛార్జర్, యూఎస్‌బీ టైప్-సీ కేబుల్‌తో పాటు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
ధరలు
కార్బన్ రెబెల్ ప్రో ధర రూ .12,499 కాగా, స్టాండర్డ్ రెబెల్ ధర రూ .11,999. ఈ రెండు మోడళ్లు నవంబర్ 4 నుండి అమ్మకానికి రానున్నాయి. ఆసక్తి ఉన్నవారు అమెజాన్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
ఇదీ చదవండి: జియో కొత్త చౌక రీచార్జ్ ప్లాన్లు వచ్చేశాయ్..


