మూలధన లాభం వచ్చింది. పన్ను చెల్లించారు. మిగిలిన మొత్తం మీ ఇష్టం. మీరు మీ ప్లానింగ్ చేసుకోవచ్చు. మూలధన లాభాల మీద పన్ను చెల్లించకుండా కూడా బైటపడవచ్చు. అది కూడా రాచమార్గంలోనే. చట్టప్రకారంగానే, చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. కొంత మంది ఏం చేశారో చూడండి.
1.శర్మ 2025 సెప్టెంబర్‌లో రాజమండ్రిలోని తన ఇంటిని రూ. 16,00,000కి అమ్మారు. ఆ ఇల్లు 2024 ఏప్రిల్‌లో రూ. 4,00,000కి కొన్నారు. ఆరు నెలల లోపల రూ. 29,00,000 ఇల్లు కొన్నారు. శర్మ కొన్న వ్యవహారం, ముందు అమ్మిన వ్యవహారం.. ఏదీ కూడా రూ. 30,00,000 దాటలేదు కాబట్టి, ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకి ఎటువంటి సమాచారం చేరదని, మొత్తం వ్యవహారాన్ని గప్‌చుప్‌గా ఎవరికీ చెప్పొద్దని, డిక్లేర్ చేయొద్దని బావమరిది సలహా. అటువైపే మొగ్గు చూపింది కట్టుకున్న సతీమణి. బావమరిది చెప్పింది నిజమే. వ్యవహారం వివరాలు ఆదాయపు పన్ను శాఖ వారికి వెళ్లకపోవచ్చు. కానీ డాక్యుమెంట్లు, బ్యాంకులో పద్దులు ఉన్నాయిగా. పన్నుకి గురయ్యే వ్యవహారం కాబట్టి శర్మగారు డిక్లేర్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. అయితే, ఇక్కడ ఒక కవచం ఉంది.
అమ్మిన ధర రూ.16,00,000 (ఇదే ధర.. మార్కెట్ విలువ ఒకటే అనుకోండి)
కొన్న ధర రూ. 4,00,000
మూలధన లాభం రూ. 12,00,000
మొత్తం పన్ను భారం లేకుండా.. ఉండేందుకు, మూల ధన లాభాన్ని వెచ్చించి కొత్త ఇల్లు కొన్నారు. రూ. 12,00,000ల ప్రతిఫలం రాగా .. రూ. 29,00,000 పెట్టి ఇల్లు కొన్నారు. కాబట్టి ఎటువంటి పన్ను పడదు.

ఇదే స్టాంపు విలువ రూ. 20,00,000 అనుకోండి. వచ్చిన నగదు రూ. 16,00,000 దానికన్నా రూ. 4,00,000 తక్కువ. 20 శాతం వ్యత్యాసం ఉంది. కాబట్టి విధిగా రూ. 20,00,000లను అమ్మిన ధరగా తీసుకోవాలి. అలా, అయితే, మూల ధన లాభం రూ. 20,00,000 - రూ. 4,00,000= రూ. 16,00,000. ఇంతకు మించిన మొత్తాన్ని వెచ్చించారు కాబట్టి పన్ను భారం ఏమీ ఉండదు. ఈ కేసులో ఇండెక్సింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
2. విశాఖపట్నంలో రాజు కథ. కాస్త పాతది. మావగారిచ్చిన జాగా మీద రూ. 3,00,000 పెట్టి 1996లో కట్టిన భవంతి అది. 2011 ఏప్రిల్‌లో రిటైర్మెంట్ ఫండ్స్‌తో రూ. 10,00,000 పెట్టి మరో అంతస్తు వేశారు. ఈ ఇంటిని 2025 అక్టోబర్‌లో రూ. 2 కోట్లకు అమ్మారు. అప్పుడు ఇండెక్సింగ్ 376. 1996 నాటి వ్యవహారం 2001 ఏప్రిల్ 1కి ముందుది కాబట్టి ఈ జాగాకి, భవంతికి సబ్ రిజిస్ట్రార్ గారి సర్టిఫికెట్ ప్రకారం మార్కెట్ విలువ తీసుకోవాలి. నోటి మాటలు నడవవు. ధృవీకరణ పత్రం కావాలి. 2001 ఏప్రిల్ 1 నాటి మొత్తం విలువ రూ. 12,00,000. ఆ సంవత్సరంలో ఇండెక్సింగ్ 100.
రాజుకు ఉన్న దారులు
➤ మూలధన లాభం మీద 20 శాతం పన్ను కట్టడం
➤ మూలధన లాభం పెట్టి కొత్తగా ఒక ఇల్లు 3 సంవత్సరాల లోపల కొనడం/కట్టించడం. తక్కువ పడితే, నిష్పత్తి ప్రకారం పన్ను కట్టాలి. సకాలంలో పూర్తి డబ్బుతో ఇల్లు కొంటే పన్ను భారం ఉండదు.
➤ మొత్తం మూలధన లాభం రూ. 1,43,00,000 అనుకుందాం. బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా రూ. 50,00,000కే పరిమితం.
➤ చేతికొచ్చినది రూ. 2 కోట్లు. రూ. 50 లక్షలు బాండ్లు కొని. కోటిన్నర పెట్టి ఇల్లు కొనవచ్చు.
➤ ఇదంతా కాలవ్యవధి లోపల చేయాలి.
➤ భార్య/భర్త/కొడుకు .. కుటుంబ సభ్యుల పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చు.
➤ ఒక ఇల్లే కొనాలి. రెండు కొన్నా.. ఒకదానికే మినహాయింపు ఇస్తారు.
జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ట్యాక్సేషన్ నిపుణులు: డా.కందాళ సత్యనారాయణ మూర్తి, కె.వి.ఎన్. లావణ్య


