చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్‌ రూల్స్‌ ఇవే.. | China Gold Buying Rules limit taxes india comparison | Sakshi
Sakshi News home page

చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్‌ రూల్స్‌ ఇవే..

Oct 19 2026 8:09 AM | Updated on Oct 19 2026 8:38 AM

China Gold Buying Rules limit taxes india comparison

చైనా భారీగా టన్నులకొద్దీ బంగారం కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆ దేశ కేంద్ర బ్యాంకు మాత్రం తన బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతోంది. మరోవైపు, చైనాలోని సాధారణ పౌరులు కూడా బంగారు ఆభరణాలు, నాణేలు, కడ్డీలు, బంగారం ఆధారిత పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారు. అయితే చైనాలో సామాన్య ప్రజలు బంగారాన్ని ఎలా కొనుగోలు చేయవచ్చు? ఒక వ్యక్తి గరిష్ఠంగా ఎంత బంగారం కొనవచ్చు? కొనుగోళ్లపై పన్నులు ఎలా ఉంటాయి? భారత్‌తో పోలిస్తే ఆ దేశంలో నిబంధనలు ఎలా ఉన్నాయి? చూద్దాం ఈ కథనంలో..

చైనాలో బంగారం కొనుగోలుపై పరిమితులున్నాయా?

చైనాలో సాధారణ పౌరులు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఎంత బంగారమైనా కొనుగోలు చేయొచ్చు. దీనికంటూ ఒకే విధంగా వర్తించే నిర్దిష్ట గరిష్ఠ పరిమితి అంటూ ఏదీ లేదు. అర్హత కలిగిన దుకాణాలు, బ్యాంకులు, అనుమతిపొందిన విక్రయ మార్గాల ద్వారా బంగారు ఆభరణాలు, నాణేలు, కడ్డీలను కొనుగోలు చేయవచ్చు. అయితే బంగారం రకం, కొనుగోలు చేసే విధానం, విక్రేతకు వర్తించే నిబంధనల ఆధారంగా కొన్ని షరతులు ఉండవచ్చు. అంటే, ఒక వ్యక్తి తప్పనిసరిగా 100 గ్రాములు, 500 గ్రాములు లేదా ఒక కిలో బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన ఏమీ లేదు. అదే సమయంలో, పెద్ద మొత్తంలో బంగారు కొనుగోలు చేస్తే సంబంధిత  పత్రాలు అవసరమవుతాయి.

భారత్‌లో పరిస్థితి ఏమిటి?

భారత్‌లోనూ సాధారణ పౌరులు తమ డబ్బుతో బంగారం కొనుగోలు చేయడానికి మొత్తం బంగారం బరువుపై సాధారణ గరిష్ఠ పరిమితి లేదు. అయితే కొనుగోలు విలువ, చెల్లింపు విధానం, బంగారం నిల్వకు సంబంధించిన ఆదాయపు పన్ను నిబంధనలు పాటించాలి. ఒక లావాదేవీలో రూ.2 లక్షలకు మించిన బంగారం లేదా ఆభరణాల కొనుగోలుకు సాధారణంగా పాన్‌ లేదా ఆధార్‌ వంటి గుర్తింపు వివరాలు అవసరమవుతాయి. అధిక విలువ గల లావాదేవీలపై పన్ను శాఖకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలాగే నగదు లావాదేవీలకు ప్రత్యేక పరిమితులు వర్తిస్తాయి.

చైనాలో బంగారం కొనుగోలుపై పన్నులు ఎలా ఉంటాయి?

చైనాలో బంగారంపై పన్నుల విధానం 2025 నవంబర్ 1 నుంచి మారింది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ, పన్ను శాఖ ప్రకటించిన మార్పుల ప్రకారం, షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ లేదా షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్ ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని బయటకు తీసి, పెట్టుబడి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే కొన్ని లావాదేవీలకు గతంలో ఉన్న 13 శాతం విలువ ఆధారిత పన్ను (VAT) మినహాయింపును తగ్గించారు. సంబంధిత కొనుగోళ్లలో మినహాయింపు 6 శాతానికి పరిమితమైంది. ఈ విధానం 2027 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉండేలా ప్రకటించారు.

భారత్‌లో బంగారంపై పన్నులు ఎంత?

భారత్‌లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా 3 శాతం వస్తు సేవల పన్ను (GST) వర్తిస్తుంది. బంగారంపై దిగుమతి సుంకం కూడా దేశీయ ధరలను ప్రభావితం చేస్తుంది. 2026 మే 13 నుంచి కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై మొత్తం కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం, 5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ ఉన్నాయి. ఈ సుంకం దిగుమతి దశలో వర్తిస్తుంది.

చైనాలో బంగారం ధరలు తక్కువా?
బంగారం కొనుగోలుకు సంబంధించి చైనా, భారత్‌లో నిబంధనలు ఒకేలా ఉన్నప్పటికీ, ధరల్లో విషయంలో మాత్రం కాస్త తేడా ఉంటుంది. భారత్‌తో పోలిస్తే చైనాలో పసిడి ధరలు కాస్త తక్కువే. 10 గ్రాముల బంగారం ధరపై అటుఇటుగా సుమారు రూ.20000 తేడా ఉండొచ్చు.

ఇదీ చదవండి: ఏళ్లకు ఏళ్లు.. పైసా లాభం లేని స్టాక్‌ మార్కెట్లు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement