ఏళ్లకు ఏళ్లు.. పైసా లాభం లేని స్టాక్‌ మార్కెట్లు ఇవే.. | Stock Markets That Crashed Took Decades to Recover Japan China India | Sakshi
Sakshi News home page

ఏళ్లకు ఏళ్లు.. పైసా లాభం లేని స్టాక్‌ మార్కెట్లు ఇవే..

Oct 18 2026 8:22 AM | Updated on Oct 18 2026 8:35 AM

Stock Markets That Crashed Took Decades to Recover Japan China India

స్టాక్‌ మార్కెట్లు అంటే చాలా మందికి ఆకర్షణ. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు పెడితే కళ్లు చెదిరే లాభాలను చూసే అవకాశం ఉంటుంది. అయితే, మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో ప్రయాణించవు. కొన్ని సందర్భాల్లో భారీ పతనం నుంచి కోలుకోవడానికి సంవత్సరాలు, చివరకు దశాబ్దాలు కూడా పట్టవచ్చు. తాజాగా ఇండోనేషియా స్టాక్‌ మార్కెట్‌ పతనం ఈ ప్రమాదాన్ని మరోసారి గుర్తుచేసింది. 2026 అక్టోబర్‌ 16న జకార్తా కాంపోజిట్‌ ఇండెక్స్‌ (JCI) ఏకంగా 11.57 శాతం క్షీణించింది. 1998 ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక్క రోజులో నమోదైన అతిపెద్ద పతనంగా ఇది నిలిచింది.

అంతర్జాతీయ సూచీల్లో ఇండోనేషియా స్థాయిని తగ్గించే అవకాశం ఉందన్న ఎంఎస్‌సీఐ (MSCI) ప్రకటనతో విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరిగాయి. అయితే, ఇది ఒక్కరోజు మార్కెట్‌ పతనానికి సంబంధించిన వార్త మాత్రమే కాదు.. గతంలోనూ ప్రపంచంలోని పలు ప్రధాన మార్కెట్లు పెట్టుబడిదారులకు సుదీర్ఘకాలం నిరాశాజనక రాబడులను అందించిన సందర్భాలున్నాయి.

జపాన్‌

జపాన్‌ స్టాక్‌ మార్కెట్‌ చరిత్ర దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రభావం చూపిన అతిపెద్ద ఉదాహరణల్లో ఒకటి. 1980ల చివర్లో అక్కడి షేర్లు, రియల్‌ ఎస్టేట్‌ ధరలు భారీగా పెరిగాయి. అయితే, ఆస్తుల ధరల బుడగ పగిలిపోవడంతో మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిక్కీ 225 సూచీ 1989 డిసెంబర్‌ 29న 38,915.87 పాయింట్ల వద్ద గరిష్ఠ ముగింపు స్థాయిని నమోదు చేసింది. ఆ స్థాయిని తిరిగి అధిగమించడానికి 34 ఏళ్లకు పైగా సమయం పట్టింది. చివరకు 2024 ఫిబ్రవరి 22న నిక్కీ 225 సూచీ 39,098.68 పాయింట్ల వద్ద ముగిసి కొత్త రికార్డును సృష్టించింది. ఆస్తుల ధరల పతనం తర్వాత జపాన్‌ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న దీర్ఘకాలిక మందగమనం ఈ ఆలస్యానికి ప్రధాన నేపథ్యం.

చైనా

చైనా షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 2007 అక్టోబర్‌ 16న 6,124.04 పాయింట్ల వద్ద చారిత్రక గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం, దేశీయ ఆర్థిక పరిణామాలు, మార్కెట్‌లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు సూచీ ప్రయాణాన్ని ప్రభావితం చేశాయి. 2026 సెప్టెంబర్‌ 30 నాటికి ఈ సూచీ 3,842.19 పాయింట్ల వద్ద ముగిసింది. అంటే, 2007 గరిష్ఠ స్థాయితో పోలిస్తే దాదాపు 37.3 శాతం దిగువన ఉంది. దాదాపు 19 ఏళ్లు గడిచినా ధరల సూచీ పాత రికార్డును చేరుకోలేకపోయింది. గరిష్ఠ స్థాయికి సమీపంలో కొనుగోలు చేసినవారికి ఇది ఎంతటి దీర్ఘకాలిక నిరీక్షణగా మారిందో ఈ గణాంకాలు చెబుతున్నాయి.

భారత్‌

భారత స్టాక్‌ మార్కెట్‌ కూడా 1990లలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. 1992లో హర్షద్‌ మెహతా సెక్యూరిటీస్‌ కుంభకోణం వెలుగులోకి రావడంతో మార్కెట్‌ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. ఆ తర్వాతి కాలంలో పెట్టుబడిదారులు గణనీయమైన మార్పులను చూశారు. 2000లో డాట్‌కామ్‌ బూమ్‌ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6,000 పాయింట్ల స్థాయిని దాటింది. అయితే, టెక్నాలజీ షేర్లలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పతనం, ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో భారత మార్కెట్‌ కూడా వెనక్కి తగ్గింది. 2002లో సెన్సెక్స్‌ 3,377.28 పాయింట్ల వద్ద ముగిసింది.

అమెరికా

అమెరికా స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనూ పెట్టుబడిదారులకు కఠినమైన దశలు ఉన్నాయి. 1960ల చివరి నుంచి 1980ల ప్రారంభం వరకు అధిక ద్రవ్యోల్బణం, చమురు ధరల షాక్‌లు, ఆర్థిక అస్థిరత ఈక్విటీ పెట్టుబడుల వాస్తవ రాబడులను దెబ్బతీశాయి. ప్రత్యేకించి 1966–1982 మధ్య ఎస్‌అండ్‌పీ 500 సూచీ వార్షిక సగటు ద్రవ్యోల్బణ సర్దుబాటు రాబడి సుమారు మైనస్‌ 1.4 శాతంగా నమోదైనట్లు అందుబాటులో ఉన్న చారిత్రక విశ్లేషణలు సూచిస్తున్నాయి.

ఇండోనేషియా

ఇండోనేషియా మార్కెట్‌ ప్రస్తుత సంక్షోభం కేవలం ఒకరోజు పతనంతోనే మొదలుకాలేదు. ఎంఎస్‌సీఐ గణాంకాల ప్రకారం.. 1994 మే నుంచి 2026 ఏప్రిల్‌ వరకు డాలర్లలో లెక్కించిన ఇండోనేషియా సూచీ వార్షిక సగటు ధరల రాబడి మైనస్‌ 0.6 శాతంగా ఉంది. ఇందులో డివిడెండ్లు కలపలేదు. అంటే, దీర్ఘకాలంలోనూ ధరల సూచీ పనితీరు బలహీనంగా ఉందన్నమాట. ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది అక్టోబర్‌ 16న చోటుచేసుకున్న భారీ పతనం.

ఇదీ చదవండి: పసిడి, వెండి.. పోటాపోటీగా పడిన ధరలు.. వారమంతా ఊరటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement