Buy gold
-
లైవ్ ధరలకు బంగారం.. ‘ధన్ గోల్డ్ వాల్ట్’ లాంచ్
పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్ వాల్ట్ పేరిట ప్రత్యేక సాధనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ధన్ వెల్లడించింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేయడంతో పాటు అవే లైవ్ ధరల ప్రకారం భౌతిక రూపంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఈ లావాదేవీల సెటిల్మెంట్, భౌతిక డెలివరీ ప్రక్రియను ఎంసీఎక్స్సీసీఎల్ పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన లోహాలను అత్యంత సురక్షితమైన ఇనిస్టిట్యూషనల్ గ్రేడ్ వాల్ట్‌లలో కూడా భద్రపర్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి హిడెన్ చార్జీలు, అదనపు రుసుములు ఉండవని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రవీణ్ జాదవ్ తెలిపారు. ఈ తరహా సాధనాల్లో ఇదే మొదటిదని పేర్కొన్నారు.డిజిటల్ బంగారం కొనుగోలు పద్ధతుల్లో ఈ ‘ధన్ గోల్డ్ వాల్ట్’ ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. సాధారణంగా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్స్ థర్డ్ పార్టీ వెండర్లపై ఆధారపడతాయి, కానీ ధన్ నేరుగా ఎంసీఎక్స్ లైవ్ ధరలను అనుసంధానించడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వినియోగదారులు కేవలం 1 గ్రాము బంగారం లేదా వెండి నుండి తమ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని నేరుగా నగల రూపంలోకి మార్చుకునేందుకు లేదా అవసరమైనప్పుడు విక్రయించి నగదును తక్షణమే తమ బ్యాంక్ ఖాతాల్లోకి పొందేందుకు వీలుగా మరిన్ని ఫీచర్లను జోడించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు మార్కెట్ ఒడుదొడుకులను గమనిస్తూ తక్కువ ధర ఉన్నప్పుడు తక్షణమే ఆర్డర్ పెట్టుకునే సౌలభ్యం ఉండటం దీని ప్రత్యేకత. -
పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..
ఆశలు అక్షయం కావాలని కోరుకుంటూ భారతీయులు జరుపుకునే పవిత్ర పండుగ అక్షయ తృతీయ. ఈ ప్రత్యేక సందర్భంలో పసిడి కొనుగోలు చేయడం అనవాయితీ. ఈ ఏడాది కూడా పసిడి కొనుగోళ్లకు జనం సిద్ధమవుతున్నప్పటికీ, ఆకాశాన్నంటుతున్న ధరలు సామాన్యుడి అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధరల్లో వచ్చిన భారీ మార్పు ఇప్పుడు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.ధరల వ్యత్యాసం2025 అక్షయ తృతీయ నాటి ధరలతో పోలిస్తే, ఈ ఏడాది (2026) బులియన్ మార్కెట్లో పెను మార్పులు సంభవించాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.96,000 నుండి రూ.97,000 మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధరకు కేవలం 6 నుండి 6.5 గ్రాములు మాత్రమే వస్తోంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కొనుగోలుదారుల శక్తి 30-40% వరకు క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.దేశంలో ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం (24 క్యారెట్స్) ధర రూ.1,52,840 లుగా (ఏప్రిల్ 11 నాటికి) ఉంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,40,100 లుగా ఉంది.ఎందుకీ పరుగు?బంగారం ధరలు ఇలా అదుపు లేకుండా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు 'సురక్షిత ఆస్తి'గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భౌతిక బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, ఇటిఎఫ్ (ETF)లపై ఆసక్తి పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పైపైకి వెళ్తున్నాయి.మారిన వినియోగదారుల తీరుధరలు భారమైనా సెంటిమెంట్‌ను వదులుకోని భారతీయులు, తమ కొనుగోలు పద్ధతులను మార్చుకుంటున్నారు. భారీ ఆభరణాల కంటే తక్కువ బరువుతో ఆకర్షణీయంగా కనిపించే డిజైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాషన్ కంటే పెట్టుబడి దృక్పథంతో బంగారు నాణేలను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా నగదు ఖర్చు చేసే కంటే, ఇంట్లో ఉన్న పాత ఆభరణాలను ఇచ్చి కొత్తవి తీసుకునే 'ఎక్స్ఛేంజ్ స్కీంల' వైపు జనం మొగ్గు చూపుతున్నారు.వ్యాపారుల వ్యూహాలుకస్టమర్లను ఆకర్షించడానికి జ్యువెలరీ షాపులు కూడా రాయితీలను ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు, ముందస్తు బుకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఒక్కొక్కరు కొనే బంగారం పరిమాణం తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా?
వాష్టింగన్: ఇరాన్‌పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడుల్ని ముగించేలా ట్రంప్ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్ జలసంధి అంశంలో ఇరాన్ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్‌పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఔన్స్‌కి 4,550 డాలర్లను దాటిందిదీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారుబెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావంచమరు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.కేంద్ర బ్యాంకుల ధోరణిగత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్‌పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. -
కొత్త బడ్జెట్ వచ్చేలోపే బంగారం కొనేస్తే మంచిదా?
కేంద్ర బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) రాకకు ఇంక కొన్ని రోజులే ఉంది. రానున్న బడ్జెట్ బంగారంపై (Gold) కస్టమ్స్ సుంకాన్ని పెంచవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. తద్వారా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ధర తగ్గుదల సమయంలో బంగారం కొనుగోలు చేయడం వ్యూహాత్మక చర్యగా నిపుణులు సూచిస్తున్నారు.2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం, వెండి కడ్డీలపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుండి 6%కి తగ్గించారు. తదనంతరం 2024 ఆగస్టులో బంగారం దిగుమతులు సంవత్సరానికి సుమారుగా 104% పెరిగి 10.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే అదే సమయంలో భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 23% పైగా క్షీణించి 1.99 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.గత బడ్జెట్లో ధరలను స్థిరీకరించడానికి, నిరంతర ద్రవ్యోల్బణం మధ్య తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. అయితే దిగుమతి సుంకం తగ్గింపు పెరిగిన బంగారం వినియోగం గురించి ఆందోళనలను లేవనెత్తింది. ఇది వాణిజ్య లోటును విస్తరిస్తుంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బంగారు వినియోగదారు అయిన భారత్ తన డిమాండ్‌ను తీర్చుకోవడానికి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.బడ్జెట్ కంటే ముందే కొనేయాలా?డాలర్ బలపడుతున్నప్పటికీ గత వారం బంగారం ధరలు పెరిగాయి. బంగారం మార్కెట్ నుండి ఆరోగ్యకరమైన డిమాండ్, దేశీయ స్టాక్ మార్కెట్లో బలహీనత బంగారం ధరలలో నిరంతర పెరుగుదలకు దారితీసింది. గత వారం 1 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచితే దేశీయ మార్కెట్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు."బంగారం పట్ల పెరుగుతున్న ట్రెండ్‌ను అరికట్టడానికి, ముఖ్యంగా గత సంవత్సరం దిగుమతి సుంకాల తగ్గింపును అనుసరించి ప్రభుత్వం 2025 బడ్జెట్లో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచవచ్చు" అని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకుడు సుఖంద సచ్‌దేవా అభిప్రాయపడ్డారు. "దిగుమతి సుంకం పెంపు బంగారం ధరను పెంచుతుంది, తత్ఫలితంగా దేశీయ ధరలు పెరుగుతాయి. ధర తగ్గుదల సమయంలో బంగారం కొనుగోలు చేయడం వ్యూహాత్మక చర్యగా మారుతుంది. ఎందుకంటే కొనుగోలుదారులు స్వల్పకాలిక అంచనా ధరల పెరుగుదల నుండి ప్రయోజనం పొందవచ్చు" అన్నారు.అయితే, బంగారం ధరలకు కస్టమ్స్ సుంకం పెంపు ఒక్కటే ఉత్ప్రేరకం కాదు. ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ముట్టుకోకపోయినా, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. "పన్ను పెంపు లేకున్నా, ప్రపంచ ఆర్థిక దృశ్యం అనిశ్చితంగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి పాలసీ మార్పులు బంగారం సురక్షిత ఆకర్షణను పెంచగలవు. ఇదే నెలలో జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని మార్కెట్ భాగస్వాములు నిశితంగా పరిశీలిస్తారు. ప్రధాన ద్రవ్యోల్బణం డిసెంబరులో తగ్గినప్పటికీ గత రెండు నెలలుగా ఇది స్థిరంగా ఉంది. వడ్డీ రేటు తగ్గింపుపై ఫెడరల్ రిజర్వ్ తన వైఖరిని పునఃపరిశీలించవచ్చు. ఇది బంగారం ధరలకు మద్దతు ఇవ్చవచ్చు" అని సుఖంద సచ్‌దేవా పేర్కొన్నారు. -
అక్షయ తృతీయ: బంగారం కొంటున్నారా? అయితే ఇది మీ కోసమే!
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం..సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడు పరమేశ్వరుణ్ని ప్రార్ధించగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చిన్నట్లు చెబుతుంది. మన పెద్దలు సైతం లక్ష్మీ దేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని చెబుతుంటారు. అందుకే ఈ పర్వదినం సందర్భంగా ఎవరి తాహతకు తగ్గట్లు వాళ్లు బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే కొనుగోలు దారులు బంగారం కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►మీరు బంగారం కొనడానికి ప్రయత్నించే ముందు దాని ప్రస్తుతం ధర ఎంతుందో తెలుసుకోవాలి. బంగారాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే కొంత మంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కాకుండా.. కాస్త ఎక్కువ చేసి చెపుతుంటారు. కాబట్టి బంగారం కొనే ముందు.. మార్కెట్లో ఆ బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ►బంగారం కొనే సమయంలో.. బంగారం బరువు తూకం వేసే బాట్ల(వెయిట్స్)ను చెక్ చేయండి. ఎందుకంటే ఆ తూకం యంత్రం సాయంతో తక్కువ బంగారం.. ఎక్కువగా ఉన్నట్లు చూపి మోసం చేస్తుంటారు. ►హాల్ మార్క్స్ వేసిన బంగారమా! కాదా అనేది చెక్ చేయండి. కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. ఈ లోగోతో పాటు హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్(హెచ్‌యూఐడీ)నెంబర్ అనే 6 అంకెల కోడ్ ఉంటుంది. ►మీరు పెట్టుబడి ప్రయోజనాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నట్లైతే.. మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10శాతం మించకుండా చూసుకోండి చదవండి: బంగారం కొనుగోలు దారులకు శుభవార్త! కేంద్రం కీలక నిర్ణయం! -
బంగారం ‘బిస్కెట్’ వేశాడు..
⇒ రూ. 2 లక్షలకే కిలో బంగారం! ⇒ ఢిల్లీ నుంచి ఆగంతుకుడి ఫోన్ ⇒ ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లిన 30 మంది ⇒ నకిలీ బంగారం ఇచ్చి ⇒ మోసం చేసిన వైనం ⇒ ఆలస్యంగా సంఘటన వెలుగులోకి ⇒ పోలీసులకు అందని ఫిర్యాదు ఉప్లూర్ (కమ్మర్పల్లి): మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు రూ. రెండు లక్షలకు కిలో చొప్పున బంగారం కొనుగోలు చేసి మోసపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఒక ఆగంతకుడు గ్రామంలోని చాలామందికి ఫోన్ చేసి తమ వద్ద బంగారం ఉందని, కావాలంటే రూ. రెండు లక్షలకు కిలో ఇస్తామని నమ్మించాడు. దీంతో కొందరు గ్రూపులు గ్రూపులుగా కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ లాడ్జి తీసుకొని అందులో ఉండి, ఫోన్ చేసిన వ్యక్తిని కలిశారు. దేవాలయాల్లోని బంగారమని, దీన్ని తక్కువ ధరకు విక్రయించి తొందరగా నగదు చేసుకోవాలనుకుంటున్నామని ఆగంతకుడు వారిని నమ్మించాడు. తన వద్ద ఉన్న బంగారం బిస్కెట్ నుంచి ఓ ముక్క కత్తిరించి ఇచ్చి అసలుదా, నకిలీదా చెక్ చేసుకోవాలని సూచించాడు. దీంతో వారు జ్యూయలరీ షాపులకు వెళ్లి చెక్ చేసుకొని అసలుదని నిర్ధారణ చేసుకున్నారు. అనంతరం బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని రూ. రెండు లక్షలకు కిలో కొనుగోలు చేసుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చారు. కొంతమంది కిలో, రెండు కిలోలు చొప్పున 30 మందికి పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం. స్వగ్రామానికి వచ్చాక స్థానిక కంసాలి వద్దకు వెళ్లి చూపగా, బిస్కెట్లు రాగివని తేలింది. దీంతో మోసపోయామని గ్రహించి గొల్లుమన్నారు. వారం రోజుల పాటు గోప్యత పాటించినప్పటికీ బయటకు పొక్కింది. ఆనోట, ఈనోట పడి ఊరంతా దావానలంలా వ్యాపించింది. బాధితులు బయటకు చెప్పుకోలేక, మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ పేరిట ఎటు పోతుందో తెలియక భయపడి ఊరుకుంటున్నారు. ఫోన్‌నంబర్లు ఎలా తెలుసంటే.. గ్రామంలోని కొంతమందికి బంగారం కొనుగోలు గురించి ఫోన్ చేసినవారికి బాధితుల ఫోన్ నంబర్లు ఎలా తెలుసనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని హార్వెస్టర్, ట్రాక్టర్ డ్రైవర్ల ద్వారా ఢిల్లీలోని మోసగాళ్లకు తెలిసినట్లు గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వారే తమ యజమానుల ఫోన్ నంబర్లు సదరు వ్యక్తులకు అందించినట్లు తెలుస్తోంది.


