‘ముస్లిం అయివుంటే..’.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు | Ram Mandir Donations Theft Case Owaisi Targets Yogi Government | Sakshi
Sakshi News home page

‘ముస్లిం అయివుంటే..’.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Jun 30 2026 1:03 PM | Updated on Jun 30 2026 1:09 PM

Ram Mandir Donations Theft Case Owaisi Targets Yogi Government

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవేళ  మందిర్ ట్రస్ట్‌లో గనుక ముస్లిం ఉండి ఉంటే, ఈపాటికే ప్రభుత్వం అతనిని ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపి, బుల్‌డోజర్లతో ఇల్లు కూల్చివేసేదని ఒవైసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హైప్రొఫైల్ నిందితులను రక్షించేందుకే పోలీసులు కస్టడీ కోరడం లేదని, నిందితులు ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నారని ఆయన ఆరోపించారు.

ఈ భారీ విరాళాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయగా, మరో ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా వైదొలిగారు. ఆలయ పుస్తకాల రికార్డుల ప్రకారం సుమారు రూ. 7 నుండి 7.5 కోట్ల నగదు మాయమైనట్లు అంచనా వేస్తుండగా, పోలీసులు ఇప్పటివరకు నిందితుల నుండి దాదాపు రూ. 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే వారిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తామని, ఎవరినీ విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అంశాన్ని బహిరంగంగా లేవనెత్తిన తర్వాత, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణకు ఆదేశించింది. జూన్ 25న ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన తొలి ఎఫ్‌ఐఆర్ (ఎఫ్‌ఐఆర్‌) ఆధారంగా విరాళాల లెక్కింపు సిబ్బందికి చెందిన అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రాతో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం ఆలయ నిర్వహణ వ్యవస్థల సమూల మార్పునకు,  రాజకీయ విమర్శలకు దారితీసింది.

ఇది కూడా చదవండి: ఉద్ధవ్‌కు మరో షాక్: షిండే గూటికి ఎమ్మెల్సీ సచిన్ అహిర్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement