ఉద్ధవ్‌కు మరో షాక్: షిండే గూటికి ఎమ్మెల్సీ సచిన్ అహిర్ | Uddhav Thackeray Faces Major Blow As MLC Sachin Ahir And Six Lok Sabha MPs Back Shinde Sena, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉద్ధవ్‌కు మరో షాక్: షిండే గూటికి ఎమ్మెల్సీ సచిన్ అహిర్

Jun 30 2026 12:45 PM | Updated on Jun 30 2026 12:54 PM

Uddhav Thackeray Faces Major Blow as MLC Sachin Ahir and Six Lok Sabha MPs

ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి మహారాష్ట్రలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ సచిన్ అహిర్ ఉద్ధవ్ వర్గాన్ని వీడి, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. షిండే గూటికి చేరిన వెంటనే, అహిర్ మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి శివసేన అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నుండి, ముఖ్యంగా ఉద్ధవ్ క్యాంప్ నుండి నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి ఎకనాథ్ షిండే వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ టైగర్’ లో భాగంగానే ఈ తాజా చేరిక చోటుచేసుకుంది.

ఈ పరిణామానికి కొన్ని రోజుల ముందే శివసేన (యూబీటీ) కి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ప్రకటించి ఉద్ధవ్‌కు కోలుకోలేని దెబ్బ తీశారు. ఢిల్లీలో జరిగిన కీలక పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్హాజరైన ఈ ఎంపీలు సంజయ్ దేశ్‌ముఖ్ (యావత్మాల్), సంజయ్ జాదవ్ (పర్భని), సంజయ్ దినా పాటిల్ (ముంబై నార్త్ ఈస్ట్), నాగేష్ పాటిల్-అష్టికర్ (హింగోలి), ఓంప్రకాష్ రాజేనింబాల్కర్ (ధారాశివ్), భౌసాహెబ్ వాక్‌చౌరే (శిరిడీ)—దక్షిణ ముంబైలోని యశ్వంతరావు చవాన్ ప్రతిష్ఠాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఉద్ధవ్ వర్గంలో ముగ్గురు లోక్‌సభ ఎంపీలు మాత్రమే మిగిలారు.

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఏకనాథ్ షిండే మాట్లాడుతూ, తమ వ్యూహాలు పక్కాగా సాగాయని, ‘ఆపరేషన్ టైగర్’ ఇప్పుడు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ప్రకటించారు. చేరిన ఎంపీలను క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న దిగ్గజాలుగా ఆయన అభివర్ణించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన అభ్యర్థులపై గెలిచిన ఈ ఎంపీల మార్పుతో మహారాష్ట్ర రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది స్థానాల్లో ఆరు స్థానాలను షిండే లాక్కోవడంతో, అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ)లో షిండే బేరసారాల శక్తి మరింత బలపడింది. మరోవైపు, దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రధానమంత్రి రేసు నుండి తప్పించడానికి అమిత్ షాయే ఈ ‘ఆపరేషన్ టైగర్’ ను నడిపించారని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement