సాక్షి, ఢిల్లీ: పార్లమెంటులో ఇటీవల ఆమోదం పొందిన వందేమాతరం బిల్లుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందేమాతరాన్ని జాతీయగీతంగా ప్రకటించే అంశంలో అప్పటి రాష్ట్రపతి ఒక పెద్ద తప్పు చేశారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వందేమాతరం దేవదేవతల ఆరాధనతో ముడిపడి ఉంటుందని. ఆయన ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే దానిని 'జాతీయ గీతం'గా ప్రకటించారాని దాని కోసం ఒక తీర్మానం చేయాల్సిందన్నారు.
వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026' ఇటీవలే ఉభయసభల్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. వందేమాతరం ఆలపించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, లేదా దాని గానానికి భంగం కలిగించడం, లేదా అవమానించడం వంటి చర్యలను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అయితే తాజాగా ఈ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు వ్యక్తం చేశారు.
అసదుద్దీన్ మాట్లాడుతూ "మీరు 'జన గణ మన' పాడినప్పుడు, దానిలో మీకు ఏమి కనిపిస్తుంది? మీకు ఈ దేశం, దాని ప్రజలు కనిపిస్తారు. మీరు 'వందేమాతరం' పాడినప్పుడు, అది దేవదేవతల ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ 'ముజాహిదీన్-ఎ-ఆజాదీ' (స్వాతంత్ర్య సమరయోధుల) గురించి మీరేం చెబుతారు? 'జన గణ మన' ప్రజల కోసం వ్రాయబడింది. 1950లో రాజేంద్ర ప్రసాద్ ఒక పెద్ద తప్పు చేశారని నేను నమ్ముతున్నాను. ఆయన ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే దానిని 'జాతీయ గీతం'గా ప్రకటించారు, కానీ దాని కోసం ఒక తీర్మానం ఆమోదించి ఉండాల్సింది. 'జాతీయ గీతం' నిర్వచనం ఎక్కడా ఇవ్వబడలేదు. (కేంద్ర ప్రభుత్వం) రాజ్యాంగంలోని 25, 26, 29 అధికరణలను ఉల్లంఘిస్తున్నారు." అని అన్నారు.


