చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుతో అన్నాడీఎంకేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ.. విజయ్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే తన పార్టీకి రాజీనామా చేశారు. అయితే, ఆయన టీవీకే చేరనున్నట్టు సమాచారం.
తమిళనాడులో మాజీ మంత్రి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. విజయభాస్కర్ తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించగా, అది ఆమోదించబడినట్లు నివేదికలు తెలిపాయి.
అయితే, ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరడంతో, పార్టీ శాసనసభ బలం తగ్గుతూ వస్తోంది. ఈ పరిణామం పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయనే సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, పార్టీని వీడుతున్న వారంతా టీవీకే తరఫున పోటీ చేసేందుకే ఇలా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది.


