ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్ర‌యాణికుల ఫైర్‌ | Mumbai AC Local Trains: 12 new services full details | Sakshi
Sakshi News home page

ముంబైలో ఏసీ లోకల్‌ రైళ్ల పెంపు.. మండిప‌డుతున్న ప్ర‌యాణికులు

Jun 29 2026 2:35 PM | Updated on Jun 29 2026 2:39 PM

Mumbai AC Local Trains: 12 new services full details

ముంబై: దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబై మ‌హా న‌గ‌రంలోని సెంట్రల్‌ రైల్వే మార్గంలో సోమవారం నుంచి కొత్తగా మరో 12 ఏసీ లోకల్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఏసీ రైళ్ల సంఖ్య‌ పెరగడంతో ముంబైకర్ల ప్రయాణం మరింత కూల్‌గా మారనుంది. ఏసీ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య పెంచినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఏసీ రైళ్లను ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్‌ (సీఎస్‌ఎంటీ)– కల్యాణ్‌ స్టేషన్ల మధ్య నడపనున్నట్లు సెంట్రల్‌ రైల్వే పేర్కొంది. దీంతో సెంట్రల్‌ రైల్వే మార్గంలో స్లో, ఫాస్ట్‌ మార్గంలో తిరుగుతున్న మొత్తం ఏసీ లోకల్‌ రైళ్ల ట్రిప్పుల సంఖ్య 120కి చేరింది. ఇందులో మెయిన్‌ లేన్‌లో 92 ట్రిప్పులు, హార్బర్‌ మార్గంలో 28 ట్రిప్పులున్నాయి. అలాగే కొంత కాలంగా కార్‌ షెడ్డులో నిలిపి ఉంచిన మరో ఏసీ లోకల్‌ రైలును నడపాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ఏసీ రైళ్ల ట్రిప్పుల సంఖ్య మరింత పెరగనుంది.

ప్రయాణికుల వ్య‌తిరేక‌త‌
ఏసీ లోకల్‌ రైళ్లపై సాధారణ ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొత్తగా 12 ఏసీ లోకల్‌ రైళ్లను పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏసీ రైళ్ల కారణంగా నాన్‌ ఏసీ రైళ్ల సంఖ్య తగ్గిందని, ఫలితంగా వాటిల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్‌ రైల్వే మార్గంలో ప్రతీరోజు మొత్తం 1,820 లోకల్‌ రైళ్లు తిరగ్గా అందులో ఏసీ రైళ్ల ట్రిప్పుల సంఖ్య 120 ఉంది. అయితే సోమవారం నుంచి కొత్తగా నడుపుతున్న ఈ ఏసీ రైళ్లను శని, ఆదివారాలతోపాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో నడపబోమని అధికారులు స్పష్టం చేశారు.  

విపరీతంగా లోకల్‌ రైళ్ల రద్దీ               
ఇప్పటికే సాధారణ లోకల్‌ రైళ్ల సంఖ్య తగ్గిపోవడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రారంభంలో ఏసీ లోకల్‌ రైళ్లకు ముంబైకర్ల నుంచి అనుకున్నంత మేర స్పందన రాలేదు. ఉదయం, సాయంత్రం పీక్‌ అవర్స్‌లో కూడా ఖాళీగా తిరిగాయి. కానీ ఆ తరువాత ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడం మొదలైంది. ప్రస్తుతం పీక్‌ అవర్స్‌తోపాటు మధ్యాహ్నం, రాత్రి సమయంలో కూడా ఏసీ లోకల్‌ రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. ఈ రైళ్లు ముంబై రైల్వే బోర్డుకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, వ్యాపార వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులు ఇలా అన్ని రంగాల ప్రయాణికులను ఏసీ లోకల్‌ రైళ్లు ఆకట్టుకున్నాయి.

ఏసీ రైళ్ల సంఖ్య 28కి
ఇదివరకే హార్బర్‌ మార్గంలో మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని మే ఒకటో తేదీన 14 ఏసీ లోకల్‌ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో 14 రైళ్ల‌ను పెంచారు. దీంతో హార్బర్‌ మార్గంలో ఏసీ రైళ్ల సంఖ్య 28కి చేరింది. రైల్వే బోర్డు అదనంగా ఆదాయం రాబట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందని, పేద ప్రయాణికులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని సాధార‌ణ రైళ్ల‌లో  ప్ర‌యాణించేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చ‌ద‌వండి: విషం మాత్ర‌ల‌తో 15,000 మంది హ‌త్య‌కు కుట్ర‌

లోకల్‌ రైల్వే నెట్‌ వర్క్‌ను విస్తరించడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ముఖ్యోద్దేశమని అందులో భాగంగా ఏసీ రైళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఏసీ లోకల్‌ రైళ్లలో ఆటోమేటిక్‌ డోరు మూసుకోవడం, తెరుచుకోవడం సిస్టం ఉండటం వల్ల ప్రయాణికులు డోరు వద్ద, ఫుట్‌ బోర్డుపై నిలబడి లేదా వేలాడుతూ ప్రయాణించే ఆస్కారం ఏ మాత్రం ఉండదని.. ఫలితంగా నడిచే రైలు లోంచి అదుపు తప్పి కిందపడటం లాంటి సంఘటనలు గణనీయంగా తగ్గిపోయాయని అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement