లోకల్‌ రైళ్లలో ఆకతాయిల ఆగడాలు | Western Railway RPF Nabs Door Blockers Across Mumbai Suburban Network | Sakshi
Sakshi News home page

ముంబై లోకల్‌ రైళ్లలో ఆకతాయిల ఆగడాలు

Jul 8 2026 8:06 PM | Updated on Jul 8 2026 8:10 PM

Western Railway RPF Nabs Door Blockers Across Mumbai Suburban Network

డోరువద్ద నిలబడి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు

15,589 మందిపై చర్యలు తీసుకున్న పోలీసులు

రూ.40.81 లక్షల జరిమానా వసూలు

అత్యధికంగా భాయందర్‌ రైల్వే స్టేషన్‌లో కేసులు నమోదు

ముంబై: లోకల్‌ రైళ్లలో డోరువద్ద నిలబడి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్ (ఆర్పీఎఫ్‌), రైల్వే పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో డోరువద్ద వేలాడుతున్న లేదా నిలబడిన 15,589 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి ఏకంగా రూ.40.81 లక్షలు జరిమానా వసూలు చేశారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్‌ ఆఖరు వరకు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో డోరువద్ద నిలబడిన వారపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ముంబై లోకల్‌ రైల్వే బోర్డు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇందులో అత్యధికంగా భాయందర్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

ముంబైకర్లకు లైఫ్‌ లైన్‌గా లోకల్‌ రైళ్లలో నిత్యం 75–80 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. ఇందులో 80 శాతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కూలీలు ఉండగా మిగతా 20 శాతం సామాన్య జనాలుంటారు. ఉదయం, సాయంత్రం పీక్‌ హవర్స్‌లో దాదాపు అన్ని రైళ్లు కిక్కిరిసి ఉంటాయి. లోపలికి వెళ్లేందుకు స్థలం దొరకదు. కానీ గ్రూపులు ఏర్పడిన కొందరు ప్రయాణికులు డోరువద్ద, ఫుట్‌ బోర్డుపై నిలబడి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తారు.

వీరు లోపలికెళ్లరు, తోటి ప్రయాణికులకు లోపలికెళ్లేందుకు అవకాశమివ్వరు. డోరు, ఫుట్‌ బోర్డుపై తిష్టవేసి నిలబడతారు. వీరు గ్రూపులుగా ఉండటంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఎవరైనా లోపలికెళ్లేందుకు దారి ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తే పెత్తనం చెలాయిస్తారు. చేయి చేసుకోవడానికి కూడా వెనకాడరు. దీంతో వీరి జోలికి పోకుండా, వాగ్వాదానికి దిగలేక ఎలాగో మెల్లమెల్లగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా తోటి ప్రయాణకులను ఇబ్బందులకు గురిచేస్తున్న అకతాయిలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే అదికారులు ఆర్పీఎఫ్, గర్నమెంట్‌ రైల్వే పోలీసు (జీఆర్పీ) బలగాలతో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో వీరంతా పట్టుబడ్డారు.  

చ‌ద‌వండి: సీఎం ఫ‌డ్న‌వీస్‌కు రాజ్ ఠాక్రే బ‌హిరంగ లేఖ‌

ఇదివరకే నడిచే లోకల్‌ రైళ్లలో అటు, ఇటూ తిరుగుతూ అక్రమ వ్యాపారం సాగిస్తున్న హాకర్లపై చేపట్టిన డ్రైవ్‌లో 7,765 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 7,748 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సెక్షన్‌ 144 ప్రకారం రూ.38.41 లక్షలు జరిమానా వసూలు చేశారు.

అత్యధికంగా కేసులు నమోదుచేసిన స్టేషన్లలో వల్సాడ్‌లో 1,315 మంది, వాపీలో 830 మంది, పాల్ఘర్‌లో 774 మంది, నందుర్బార్‌లో 691 మంది, వసయి రోడ్‌లో 621 మంది ఉన్నారు.  

ప్రత్యేక డ్రైవ్‌లో 482 ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలు, 181 రాష్ట్ర భద్రతా బలగాలు పాల్గొన్నాయి.  

2026 జనవరి ఒకటో తేదీ నుంచి జూన్‌ 25వ తేదీ వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో డోరువద్ద నిలబడిన 15,572 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.40.81 లక్షల జరిమానా వసూలు చేశారు.

అక్రమ హాకర్స్‌ 7,765పై చర్యలు తీసుకోగా ఇందులో 7,748 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.38.41 లక్షలు జరిమానా వసూలు చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement