
ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ ఉద్యోగ విరమణ
36 ఏళ్ల ’అద్భుత ప్రయాణం’ ముగింపు
ప్రతిష్టాత్మక రైళ్లు నడిపిన ధైర్యశాలి
ముంబై: ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్‌గా, 36 ఏళ్లకు పైగా తన వృత్తి జీవితంలో దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక రైళ్లను నడిపిన సురేఖ యాదవ్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఆమె ధైర్యసాహసాలు, స్ఫూర్తిదాయకమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారని సెంట్రల్ రైల్వే కొనియాడింది. ఈ ’మార్గదర్శి అద్భుత ప్రయాణం’రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది.
పురుషాధిక్య ప్రపంచంలో మెరిసి..
యాదవ్ 1989లో భారతీయ రైల్వేలో చేరారు. పురుషాధిక్యం ఉన్న రైల్వే రంగంలో అడ్డంకులను ఛేదించారు. ఆమె 1990లో అసిస్టెంట్ డ్రైవర్‌గా మారారు, తద్వారా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా గుర్తింపు పొందారు.
క్లిష్టమైన మార్గాల్లో రైళ్లు నడిపి
ముంబై సబర్బన్ లోకల్ రైళ్లతో పాటు, భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన కొండ మార్గాల గుండా సురేఖ యాదవ్ గూడ్స్ రైళ్లను నడిపారు. వందేభారత్ నుండి రాజధాని ఎక్స్‌ప్రెస్ వరకు.. దేశంలోని కొన్ని అత్యంత ప్రతిష్టాత్మక రైళ్లను కూడా ఆమె నడపడం విశేషం.
రైతు కుటుంబంలో పుట్టి..
మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబంలో సెపె్టంబర్ 2, 1965న జన్మించిన యాదవ్, రైల్వే ఉద్యోగంలో చేరడానికి ముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఆమె క్రమంగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 1996లో మొదటి గూడ్స్ రైలును నడిపారు, ఆపై 2000 సంవత్సరంలో మోటార్ ఉమన్‌గా పదోన్నతి పొందారు. 2010లో, ఆమె ఘాట్ డ్రైవర్‌గా అర్హత సాధించారు. ఆ తర్వాత వివిధ మార్గాల్లో సుదూర మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సారథ్యం వహించారు.
వందేభారత్‌కు సారథ్యం
ఆమె వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా 2023 మార్చి 13వ తేదీ నిలిచిపోతుంది. సోలాపూర్, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య తొలిసారిగా నడిపిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆమె సారథ్యం వహించారు. ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందు, చివరి బాధ్యతగా, ఇగత్‌పురి సీఎస్‌ఎంటీ మధ్య హజ్రత్ నిజాముద్దీన్–సీఎస్‌ఎంటీ మార్గంలో ప్రతిష్టాత్మక రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే అవకాశం ఆమెకు లభించింది. యాదవ్ తన చివరి రోజు ఉద్యోగ విరమణకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేశారు. సంప్రదాయం ప్రకారం, ఆమె సహోద్యోగులు కొద్ది రోజుల క్రితం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.
మార్గదర్శికి వీడ్కోలు
ఒక మార్గదర్శికి వీడ్కోలు. ఆసియా తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ యాదవ్.. 36 ఏళ్ల అద్భుతమైన సేవల తర్వాత నేడు సెలవు తీసుకుంటున్నారు. ఆమె అద్భుత ప్రయాణం.. రాబోయే తరాల రైల్వే మహిళలు, పురుషులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
– ‘ఎక్స్’లో సెంట్రల్ రైల్వే పోస్టు