విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్ రామకృష్ణ ఘోష్ చెలరేగిపోయాడు. 9.4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది పదో అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు 8 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. ఘోష్‌తో పాటు 10 మంది 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.
తాజా మ్యాచ్‌లో ఘోష్ చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్ 49.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్ మన్ (110) సెంచరీ చేయడంతో హెచ్‌పీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. హెచ్‌పీ ఇన్నింగ్స్‌లో మన్‌కు వైభవ్ అరోరా (40), అమన్‌ప్రీత్ సింగ్ (30), నితిన్ శర్మ (21) ఓ మోస్తరుగా సహకరించారు.
అనంతరం ఛేదనలో మహారాష్ట్ర కూడా తడబడుతుంది. 11.3 ఓవర్లలో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, అంకిత్ బావ్వే (4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైభవ్ అరోరా, ధలివాల్ తలో వికెట్ తీశారు.
కాగా, ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగిన రామకృష్ణ ఘోష్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 2026 వేలానికి ముందు రీటైన్ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్‌కే 2025 వేలంలో 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలర్ అయిన 28 ఏళ్ల ఘోష్ గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
అయినా సీఎస్‌కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్ చేసుకుంది. ఘోష్ లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ ఫార్మాట్‌లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు.


