ఉప్పునీటి కయ్యపై అక్రమంగా నైట్‌క్లబ్ నిర్మించారు
ట్రేడ్ లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు సాగించారు
గోవా నైట్‌క్లబ్ ప్రమాదంపై మేజిస్టీరియల్ విచారణ నివేదిక
పనాజీ: గోవా నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం, 25 మంది మరణంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు మేజిస్టీరియల్ విచారణ పూర్తయ్యింది. నివేదికను అధికారులు బుధవారం బహిర్గతం చేశారు. డిసెంబర్ 6న ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ‘బిర్చ్ బై రోమియో లేన్’లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ క్లబ్‌ను ఉప్పునీటి కయ్యపై చట్టవిరుద్ధంగా నిర్మించినట్లు విచారణలో తేలింది.
చెల్లుబాటయ్యే ట్రేడ్ లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడయ్యింది. అంతేకాకుండా అక్కడ ఎన్నో లోపాలు ఉన్నాయని, అవన్నీ చివరకు అగ్ని ప్రమాదానికి దారి తీశాయని విచారణ నివేదిక పేర్కొంది. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిసినప్పటికీ నైట్‌క్లబ్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలియజేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే బాణాసంచాను కాల్చారని వెల్లడించింది. అక్కడ ఫైర్ సెఫ్టీ పరికరాలు కూడా తగినంత లేవని గుర్తించినట్లు తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి నైట్‌క్లబ్‌లో అత్యవసర ద్వారాలు లేవని, అందుకే మరణాల సంఖ్య పెరిగినట్లు స్పష్టంచేసింది. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను క్లబ్ యాజమాన్యం ఫోర్జరీ చేశారని వెల్లడించింది.
గడువు ముగిసినా పునరుద్ధరించుకోలేదు
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో మెజిస్టీరియల్ నివేదికను అధికారులు సమర్పించారు. నైట్‌క్లబ్‌కు 2023 డిసెంబర్ 16న అర్పోరా గ్రామ పంచాయితీ ఎస్టాబ్లిష్‌మెంట్ లైసెన్స్ ఇచ్చినట్లు నివేదిక తెలియజేసింది. ఈ లైసెన్స్ కాలపరిమితి 2024 మార్చి 31న ముగిసిపోగా, ఆ తర్వాత పునరుద్ధరించుకోలేదని వెల్లడించింది. గోవా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 72ఏ ప్రకారం ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపార సంస్థను మూసివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయినప్పటికీ నైట్‌క్లబ్ విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు తప్పుపట్టింది. చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవమేనని గ్రామ సర్పంచ్ రోషన్ రెద్కార్ మేజిస్ట్రేట్ ఎదుట అంగీకరించారు. ఇదిలా ఉండగా, విచారణ నివేదికను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


