‘ఆర్డర్ల’ సునామీ.. బిర్యానీలే కాదు, ఐఫోన్లు, బంగారు నాణేలు కూడా.. | Gold and IPhones to Biryani and Burgers New Years Eve | Sakshi
Sakshi News home page

‘ఆర్డర్ల’ సునామీ.. బిర్యానీలే కాదు, ఐఫోన్లు, బంగారు నాణేలు కూడా..

Jan 1 2026 7:20 AM | Updated on Jan 1 2026 7:40 AM

Gold and IPhones to Biryani and Burgers New Years Eve

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలు 2026 నూతన సంవత్సర సంబరాల్లో మునిగితేలుతున్నారు. నిన్న అర్థరాత్రి కొత్త సంవత్సరాన్ని స్వాగతించిన జనం డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy)కి కాసుల వర్షం కురిపించాయి. డిసెంబర్ 31 రాత్రి భారతీయులు పీక్ స్టేజ్‌లో ఫుడ్ ఆర్డర్లు చేస్తూ రికార్డులు సృష్టించారు. అయితే కేవలం ఆహార పదార్థాలే కాకుండా, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా భారీగా ఆర్డర్ చేయడం గమనార్హం.

డిసెంబర్‌ 31 రాత్రి వేళ తమకు వచ్చిన ఆర్డర్ల గురించి స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో ఎప్పటిలానే బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. స్విగ్గీ నిమిషానికి వందల సంఖ్యలో బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసింది. అయితే ఈసారి ప్రజలు కేవలం ఆహారానికే పరిమితం కాకుండా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేశారు. వేడుకల సమయంలో పలువురు  ఏకంగా ఐఫోన్లను, బంగారు నాణేలను, స్మార్ట్ వాచ్‌లను కూడా ఆర్డర్ ఇచ్చారు. ఒకే రోజులో ఇన్ని రకాల విభిన్న వస్తువుల ఆర్డర్లు రావడం ఆశ్చర్యపరిచేదిగా మారింది.
 

గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాత్రి 8 గంటల సమయానికే స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితరత నగరాల్లో ఆర్డర్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కండోమ్స్, పార్టీ స్నాక్స్, కూల్ డ్రింక్స్, పూల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. డెలివరీ బాయ్స్ విరామం లేకుండా పనిచేస్తూ వేల సంఖ్యలో ఆర్డర్లను  వినియోగదారులకు అందించారు.

వినియోగదారుల నుండి వచ్చిన ఈ భారీ డిమాండ్‌ను తట్టుకునేందుకు స్విగ్గీ ముందస్తుగానే తగిన ఏర్పాట్లు చేసుకుంది. యాప్ క్రాష్ కాకుండా సంస్థ సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షించాయి. అత్యధిక రద్దీ ఉన్న సమయాల్లో కూడా డెలివరీ ఆలస్యం కాకుండా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. వేడుకల సమయాల్లో కస్టమర్ల అవసరాలను తీర్చడంలో.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఎలా ఉపయోగపడుతున్నాయో ఈ నూతన సంవత్సర ఆర్డర్లు నిరూపించాయి.

ఆశ్చర్యపరిచే ఆర్డర్లు
2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చాలామంది క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయించారు. ‘స్విగ్గీ’కి రాత్రి 7:30 గంటలకే రికార్డు స్థాయిలో 2,18,993 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. రాత్రి 9:30 గంటల సమయానికి 90,000 కంటే ఎక్కువ బర్గర్‌లు, 7,573 గజర్ కా హల్వా ఆర్డర్లు అందాయి. ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతూ, 4,244 మంది ఉప్మాను, బెంగళూరులో 1,927 మంది సలాడ్లను, 9,410 మంది కిచిడీని  ఆర్డర్‌ చేశారు. బెంగళూరులో ఒక వినియోగదారుడు ₹1.8 లక్షల విలువైన రెండు ఐఫోన్‌లను, ముంబైలో మరొకరు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేశారు.

ఇది కూడా చదవండి: సోషల్‌ మీడియాలో ‘ఫైనల్ ఇమేజ్‌- 2025’ హంగామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement