కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే ఆగ్రహం
హుబ్బళ్లి: కాంగ్రెస్ పాలిత, బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలుగా మార్చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడానికి గవర్నర్లను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యాలయాల ద్వారా కేంద్ర ప్రభుత్వం గవర్నర్లకు ఆదేశాలు ఇస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రులు సిద్ధంచేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలో చదవొద్దని చెబుతోందని పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేయకుండా వెనక్కి పంపిస్తున్నారని చెప్పా రు. ఈ విషయంలో పై స్థాయి నుంచి ఆదేశాలు అందుతున్నాయంటూ గవర్నర్లు కూడా ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారని తెలిపారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేకపోతే దేశంలో నిరంకుశ పాలన వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.


