2025 ఆర్డర్లలో చికెన్ బిర్యానీ ఫస్ట్, రెండోస్థానంలో ఇడ్లీ
ఇవీ విజయవాడ వాసుల ఆహారపు అలవాట్లు
నివేదిక విడుదల చేసిన స్విగ్గీ
సాక్షి, అమరావతి: బెజవాడ వాసుల ఆహారపు అలవాట్లు భలే ఉన్నాయి. ఉదయం ఇడ్లీ, వెజ్ దోశ వంటి సాత్విక ఆహారంతో దైనందిన కార్యకలాపాలు ప్రారంభిస్తున్న వారికి చీకటి పడితే చికెన్ ముక్క గొంతు దిగాల్సిందేనట. 2025లో వచ్చిన ఆర్డర్ల ఆధారంగా విజయవాడ వాసుల ఆహారపు అలవాట్లపై ఆన్‌లైన్ ఫుడ్ యాప్ సంస్థ స్విగ్గీ ప్రత్యేక నివేదికలో వెల్లడించింది.
చికెన్ వంటకాలకు క్రేజ్
ఆ సంస్థకు వచ్చిన ఫుడ్ ఆర్డర్లలో 7.78 లక్షల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ తొలిస్థానంలో నిలిచింది. 3.2 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ రెండో స్థానంలో, 2.7 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ 3వ స్థానంలో నిలిచాయి.
బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ.. దోశ పోటాపోటీ
ఉదయం వేళల్లో వచ్చిన ఆర్డర్లలో సింహ భాగం ఇడ్లీదే. 1.43 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ అగ్రస్థానంలో నిలవగా.. తదుపరి స్థానంలో 1.12 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ నిలిచింది. వీటితోపాటు ఉల్లి దోశ, పూరీ, వెజ్ వడలు ఉదయం వేళ అత్యధికంగా ఆర్డర్ చేశారు.
పెరుగుతున్న అర్ధరాత్రి ఆర్డర్లు
అర్ధరాత్రి ఆర్డర్లు ఇచ్చే సంస్కృతి విజయవాడలో వేగంగా విస్తరిస్తోందని స్విగ్గీ ఆ నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే రాత్రి 12 నుంచి రెండు గంటల్లోపు ఇచ్చే ఆర్డర్లు 47.7 శాతం పెరిగాయి. అర్ధరాత్రి ఇచ్చే ఆర్డర్లలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఉండగా, ఆ తర్వాత చికెన్ బర్గర్లు, చికెన్ ఫ్రై, చికెన్ పిజ్జా, చికెన్ నగ్గెట్స్ వంటి నాన్‌వెజ్ వంటకాలు ఉన్నాయి.
బెంగాలీ.. పంజాబీ వంటకాలపై మోజు
విజయవాడ వాసులు బెంగాలీ, పంజాబీ వంటకాలను అత్యధికంగా ఇష్టపడుతున్నారని వెల్లడించింది. గతేడాదిలో పోల్చితే బెంగాలీ వంటకాల ఆర్డర్లు 35 శాతం, పంజాబీ వంటకాల ఆర్డర్లు 30 శాతం పెరిగాయి.
బయట తినేద్దాం
విజయవాడలో బయట భోజనాలు చేసే అలవాటు పెరుగుతోందని వెల్లడించింది.అత్యధికంగా మదర్స్‌డే నాడు బయట హోటల్స్‌లో తినగా.. ఇందులో ఒక కుటుంబం రూ.30,079 బిల్లు చేసినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బయట తినేవారి సంఖ్య 276 శాతం పెరిగినట్టు స్విగ్గీ పేర్కొంది.
స్విగ్గీ డైన్ అవుట్ ద్వారా నగరం సమష్టిగా రూ.90 లక్షలు ఆదా చేసిందని, ఒక కస్టమర్ సింగిల్ బుకింగ్‌లో రూ. 15,109 అత్యధికంగా ఆదా చేశారని స్విగ్గీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ్ భాకూ తెలిపారు. ఫుడ్ ఆన్ ట్రైన్‌కు కూడా డిమాండ్ బాగాపెరుగుతోందని, విజయవాడ జంక్షన్‌లో ఫుడ్ ఆన్ ట్రైన్ ద్వారా చేసే ఆర్డర్లు 233 శాతం పెరిగినట్లు తెలిపింది.
కొనసాగుతున్న బిర్యానీ హవా
ఇక దేశవ్యాప్తంగా బిర్యానీ తన రాజసాన్ని కొనసాగిస్తోంది. 2025లో దేశవ్యాప్తంగా 93 మిలియన్ బిర్యానీల ఆర్డర్లు వచ్చాయి. నిమిషానికి 194, ప్రతీ సెకనుకు 3.25 బిర్యానీలు లాగించేస్తున్నారు.


