మూసుకున్న వందే భారత్‌ డోర్లు.. కొత్త ఎమర్జెన్సీ గైడ్‌లైన్లు! | Missed Vande Bharat Use the Guard's Coach to Board | Sakshi
Sakshi News home page

మూసుకున్న వందే భారత్‌ డోర్లు.. కొత్త ఎమర్జెన్సీ గైడ్‌లైన్లు!

Jun 29 2026 10:38 AM | Updated on Jun 29 2026 10:54 AM

Missed Vande Bharat Use the Guard's Coach to Board

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులను అమితంగా ఆకట్టుకుంటున్న సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్’ లో ప్రయాణించే వారికి సరికొత్త నిబంధనలు, కొన్ని అత్యవసర మార్గదర్శకాలను ఇండియన్ రైల్వేస్ జారీ చేసింది. మెట్రో తరహాలో ఉండే ఈ రైలు ఆటోమేటిక్ డోర్లు ప్రయాణ భద్రతను పెంచినప్పటికీ, సమయానికి రాని ప్రయాణికులు.. తలుపులు మూసుకుపోవడంతో స్టేషన్లలోనే ఉండిపోతున్నారు. మరికొందరు తమ స్టేషన్ రాకముందే దిగలేక రైల్‌ లోపలే చిక్కుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ఏం చేయాలో వివరిస్తూ రైల్వే శాఖ కీలక సూచనలు చేసింది.

డోర్లు పడ్డాక ఎక్కడం ఎలా?
మీరు ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చేసరికే వందే భారత్ ప్యాసింజర్ కోచ్‌ల ఆటోమేటిక్ డోర్లు లాక్ అయిపోయినా, రైలు ఎక్కడానికి ఇంకొక మార్గం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు వెనుక భాగంలో ఉండే ‘గార్డ్ కోచ్’ తలుపులు ప్యాసింజర్ డోర్లు లాక్ అయిన తర్వాత కూడా తెరిచే ఉంటాయి. సమయం మించిపోతున్నప్పుడు ప్రయాణికులు వెంటనే చివరి కోచ్ వైపు పరిగెత్తి, గార్డ్ కంపార్ట్‌మెంట్ ద్వారా లోపలికి ప్రవేశించవచ్చు. ఆ తర్వాత లోపలికి వెళ్లి తమకు కేటాయించిన సీటుకు చేరుకోవచ్చు. అయితే, ఈ ఆప్షన్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రయాణికులు నిర్ణీత సమయం కంటే ముందే స్టేషన్‌కు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

లోపల చిక్కుకుపోతే ఏం చేయాలి?
భారీ లగేజీతో ప్రయాణించే వారు కొన్నిసార్లు వందే భారత్ నిమిషాల వ్యవధిలోనే ఆగే స్టేషన్లలో త్వరగా దిగలేకపోతున్నారు. ఒకవేళ మీరు దిగకముందే ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోతే అస్సలు పానిక్ అవ్వద్దని రైల్వే శాఖ స్పష్టం చేసింది. తలుపులను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించకుండా, డోర్ల దగ్గర అందుబాటులో ఉండే 'ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్’ ద్వారా లోకో పైలట్ లేదా రైలు సిబ్బందిని వెంటనే అలర్ట్ చేయాలి. రైలు ఇంకా ప్లాట్‌ఫారమ్ దాటకపోతే, సాంకేతికంగా వీలైతే సిబ్బంది డోర్లు తెరిచి ప్రయాణికులు దిగడానికి సహాయం చేస్తారు.

దిగకుండా రైలు కదిలితే పరిస్థితి ఏంటి?
ఒకవేళ మీరు దిగకముందే రైలు స్టేషన్ నుంచి కదిలితే, తదుపరి చర్యల కోసం వెంటనే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సంప్రదించి పరిస్థితిని వివరించాలి. మీరు బుక్ చేసుకున్న డెస్టినేషన్ దాటి ప్రయాణిస్తున్నందున, మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించే అవకాశం ఉంది. అప్పుడు వర్తించే రైల్వే నిబంధనల ప్రకారం ఫైన్‌తో పాటు ప్రయాణ ఛార్జీలను వసూలు చేసి, తర్వాతి స్టేషన్‌లో దిగడానికి టీటీఈ అనుమతిస్తారు. కేవలం తాము దిగాల్సిన స్టేషన్ మిస్ అయ్యామనే కారణంతో ఎమర్జెన్సీ అలారం చైన్‌ను లాగడం లేదా ఆటోమేటిక్ డోర్లను బలవంతంగా లాగడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల భారీ జరిమానాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement