అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎన్నికల వ్యవస్థను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలన్న తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ట్రంప్ ఉదాహరణగా చూపించారు. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే భారత్‌లో గుర్తింపు ఆధారిత ఓటింగ్ విధానం అమలవుతోందని.. అందుకే అమెరికాలోనూ ఆ తరహా చట్టం రావాలంటూ ఆయన చట్టసభలపై ఒత్తిడి పెంచారు. దీంతో భారత్ స్పందించింది.
భారత ఎన్నికల యంత్రాంగం విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో నిరూపితమయ్యాయని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై తాను ప్రత్యేకంగా స్పందించబోనని చెప్పారు. అయితే భారత ఎన్నికల నిర్వహణ వ్యవస్థ విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన వాస్తవమని పేర్కొన్నారు. భారత్‌లో ఎన్నికలు భారీ స్థాయిలో జరిగినప్పటికీ.. ఓటింగ్ ప్రక్రియలో గుర్తింపు, పారదర్శకతకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.
అమెరికాలో ఓటర్ల అర్హతను మరింత కఠినంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని వాదిస్తున్న ట్రంప్.. ఇందుకు భారత్ ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపించారు. ఇటీవల భారత్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అంత భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య ఒక శాతానికి లోపే ఉందని చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఓటరుకూ చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు పత్రం అవసరమని ప్రస్తావించారు.
భారత్ సీఈసీతో అమెరికా అధికారుల చర్చలు
ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. ఈ నెల ప్రారంభంలో ఆయన అమెరికా ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు లేకుండానే ఎన్నికలు ఎలా నిర్వహించగలుగుతున్నారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రశ్నించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఓటరు గుర్తింపు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆయన వాదిస్తున్నారు.
‘సేవ్ అమెరికా యాక్ట్’కు ట్రంప్ పట్టుదల
అమెరికా ఎన్నికల ప్రక్రియలో పౌరసత్వ ధ్రువీకరణ, ఓటరు గుర్తింపును తప్పనిసరి చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ ‘SAVE America Act’కు మద్దతు కూడగడుతున్నారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హతను నిర్ధారించే నిబంధనలను ఈ బిల్లు మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వానికి ఆధారాలు సమర్పించడంతో పాటు.. దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు నిబంధన అమలు చేయాలని ట్రంప్ కోరుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌పైనా ఆంక్షలు విధించాలన్నది ఆయన ప్రతిపాదనలో కీలక అంశం.
భారత్ మోడల్‌నే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
అమెరికా ఎన్నికల్లో ఓటరు అర్హత, పౌరసత్వ ధ్రువీకరణపై రాజకీయ చర్చ తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ట్రంప్ భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే ఎన్నికలను భారత్ నిర్వహిస్తున్న తీరును ఆయన తన వాదనకు మద్దతుగా ఉపయోగించుకున్నారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం మాత్రం ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. భారత ఎన్నికల వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం, విశ్వసనీయత ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే స్పష్టం చేసింది. దీంతో అమెరికా ఎన్నికల సంస్కరణల చర్చలో భారత్ ఓటరు గుర్తింపు విధానం మరోసారి అంతర్జాతీయంగా ప్రస్తావనకు వచ్చింది.


