ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సుమారు ఆరు నెలల సమయం ఉన్న వేళ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో కీలక మార్పు చేసింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరాధనా మిశ్రా ‘మోనా’కు యూపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ కుమార్తె అయిన మోనా.. ఇప్పటివరకు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పార్టీని నడిపించే బాధ్యత ఆమె భుజాలపై పడింది.
మోనాను రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపిక చేయడంతో పాటు కాంగ్రెస్ సంస్థాగత బృందంలోనూ పలు మార్పులు చేసింది. సహరన్‌పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, దేవిందర్ నిషాద్, అలోక్ ప్రసాద్‌లను సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. మోనా స్థానంలో చౌధరి వీరేంద్ర సింగ్‌ను కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా నియమించింది. ఈ కూర్పులో బ్రాహ్మణ, ముస్లిం, ఓబీసీ, దళిత ప్రాతినిధ్యాన్ని కలిపే ప్రయత్నం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ మాత్రం ఈ నియామకాలను సంస్థాగత పునర్వ్యవస్థీకరణగా చెబుతోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలను సమీకరించడం, ఎన్నికలకు సంస్థను సిద్ధం చేయడం కొత్త బృందం ముందున్న ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించుకుంది.
1974 ఏప్రిల్ 20న జన్మించిన ఆరాధనా మిశ్రా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి ప్రమోద్ తివారీ కాంగ్రెస్‌లో సీనియర్ నేత. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రాంపూర్ ఖాస్ నియోజకవర్గం నుంచి 2014 ఉప ఎన్నికలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మోనా.. 2017, 2022 ఎన్నికల్లోనూ అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. దీంతో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అఖిలేశ్‌తో సమన్వయం కీలకం
మోనా ముందున్న మరో కీలక అంశం సమాజ్‌వాదీ పార్టీతో సమన్వయం. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్–ఎస్పీ మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరగాల్సి ఉంది. ఇరు పార్టీల మధ్య స్థానాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. అయితే అఖిలేశ్ యాదవ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని మోనా ఇప్పటికే చెప్పారు. ఎస్పీని ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా పేర్కొంటూ.. రాబోయే ఎన్నికల్లో కూటమి సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
యోగి సర్కార్‌ను ఢీకొట్టే బాధ్యత
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడం మోనా ముందున్న ప్రధాన బాధ్యత. పార్టీ క్యాడర్‌ను పునర్వ్యవస్థీకరించడం, సంస్థాగత బలాన్ని పెంచడం, ఇతర పార్టీలతో ఎన్నికల సమన్వయం వంటి అంశాలపై ఆమె దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ఆమెనే ఛాయిస్ ఎందుకు?
ఇక్కడే కాంగ్రెస్ తాజా మార్పుపై అసలు చర్చ మొదలవుతోంది. ఇప్పటివరకు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ రాయ్ స్థానంలో మోనాను తీసుకురావడం కేవలం నాయకత్వ మార్పుగానే కాకుండా పార్టీ సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పునర్‌వ్యవస్థీకరించే ప్రయత్నంగా కూడా విశ్లేషణలు ఉన్నాయి. అజయ్ రాయ్ బదులుగా తూర్పు యూపీకి చెందిన బ్రాహ్మణ మహిళా నేతను అధ్యక్షురాలిగా, పశ్చిమ యూపీకి చెందిన ముస్లిం నేత ఇమ్రాన్ మసూద్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ఈ కూర్పులో కీలక అంశంగా కనిపిస్తోంది.
అదే సమయంలో అఖిలేశ్ యాదవ్‌తో మోనా కుటుంబానికి ఉన్న రాజకీయ సంబంధాలపై కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీపై తరచూ విమర్శలు చేసిన ఇమ్రాన్ మసూద్‌కు కీలక పదవి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అంటే.. ఒకవైపు ఎస్పీతో సమన్వయానికి అవకాశం ఉన్న నాయకత్వం, మరోవైపు పశ్చిమ యూపీలో పార్టీ సామాజిక విస్తరణకు ఉపయోగపడే ముఖాన్ని ఒకే బృందంలోకి తీసుకురావడం కాంగ్రెస్ తాజా కూర్పులో కనిపిస్తున్న అంశం.
మొత్తంగా.. రాజకీయ కుటుంబ నేపథ్యం, మూడుసార్లు ఎమ్మెల్యేగా అనుభవం, రాష్ట్ర రాజకీయాలపై అవగాహనతో పాటు సామాజిక–ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకున్న కొత్త టీమ్‌లో మోనా కేంద్ర బిందువుగా నిలిచారు. ఇక 2027 ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ సంస్థను ఎలా నడిపిస్తారన్నదే కీలకం కానుంది.
ఇదీ చదవండి: కాంగ్రెస్ కుమ్ములాటకు కెప్టెన్ చెక్ పెడతారా?


