ఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలపై గతంలో రెండేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అరెస్టయ్యారు. ఢిల్లీ జల్‌బోర్డు(డీజేబీ) మురికి నీటి శుద్ధి ప్లాంట్ల టెండర్లలో భారీ అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై సత్యేంద్ర జైన్, డీజేబీ మాజీ సీఈవో ఉదిత్ రాయ్ సహా ఆరుగురిని ఏసీబీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
ఇందులో భాగంగా జైన్, ఉదిత్ ప్రకాశ్ రాయ్‌తో పాటు మాజీ కాంట్రాక్టు కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాస్తవ, ప్రైవేట్ వ్యక్తులు నాగేంద్ర యాదవ్, రాజా కుమార్ కుర్రా, పంకజ్ వర్మలను కూడా అరెస్ట్ చేసినట్లు ఏజెన్సీ వెల్లడించింది. కాగా, డీజేబీ టెండర్లలో అవకతవకల ఆరోపణలకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ 2024 మేలో కేసు నమోదు చేసింది. మురికి నీటి శుద్ధి ప్లాంట్లకు సంబంధించిన ఎలాంటి పైలట్ ప్రాజెక్టు చేపట్టలేదని, నిర్దేశించిన పరామితులకు అనుగుణంగా టెండర్లు లేనేలేవని ఏసీబీ అంటోంది.
#WATCH | Delhi | Satyendar Kumar Jain, former Minister of Water, GNCTD, was taken to Aruna Asaf Ali Hospital for a medical examination following his arrest by the Anti-Corruption Branch (ACB).
He has been arrested in a case involving large-scale irregularities, manipulation of… pic.twitter.com/ywKOdDhF6v— ANI (@ANI) August 18, 2026
గతంలో సత్యేంద్ర జైన్‌కు సంబంధించిన నాలుగు కంపెనీలు మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై 2022 మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయన్ను అరెస్ట్ చేసింది. జైలులో ఉండగానే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెయిల్, ఎటువంటి విచారణ లేకుండానే రెండేళ్లకు పైగా జైలులోనే గడిపారు. చివరకు కోర్టు ఆయనపై మనీ లాండరింగ్ కేసును కొట్టేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
బీజేపీ తీవ్ర ఆరోపణలు
ఈ వ్యవహారంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా అప్పటి ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గత పదేళ్ల పాలనలో ఒక్క డ్రెయిన్‌పైనా STP ఏర్పాటు చేయకపోవడం వల్ల యమునా కాలుష్యం మరింత పెరిగిందని ఆరోపించారు. STP టెండర్లలో అవకతవకలకు సంబంధించి స్పష్టమైన నగదు లావాదేవీల మార్గాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారని, అక్రమంగా మళ్లించిన నిధులు మాజీ మంత్రి, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పంపిణీ అయ్యాయని మల్హోత్రా పేర్కొన్నారు.
ఆప్ ఖండన..
అయితే ఆప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ ఒత్తిడితోనే సత్యేందర్ జైన్‌ను మరోసారి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ కేసు కూడా చివరకు తప్పుడు కేసుగా తేలుతుందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అతిషి కూడా అరెస్టులను ఖండించారు. అధికార బలంతో బీజేపీ అబద్ధాలు, అణచివేతను కొనసాగించవచ్చని భావించినా, నిజాన్ని శాశ్వతంగా అణచివేయలేరని అన్నారు.


