మమతా ‘గాయం’పై కొత్త ట్విస్ట్.. ‘సువేందు’ కీలక ఆదేశాలు | Bengal Govt To Probe Mamata Banerjee 2021 Nandigram Injury Claim | Sakshi
Sakshi News home page

మమతా ‘గాయం’పై కొత్త ట్విస్ట్.. ‘సువేందు’ కీలక ఆదేశాలు

Oct 3 2026 4:37 PM | Updated on Oct 3 2026 5:16 PM

Bengal Govt To Probe Mamata Banerjee 2021 Nandigram Injury Claim

నందిగ్రామ్ ’గాయం’ మళ్లీ రాజకీయ మంటలు రేపుతోంది.. 2021 ఎన్నికల వేళ మమతా బెనర్జీకి జరిగిన కాలి గాయం ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా దర్యాప్తునకు ఆదేశించింది. మమత కాలికి గాయం అదంతా నటనే.. రాజకీయ ప్రయోజనాల కోసం నాటకం అంటూ సీఎం సువేందు అధికారి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్నాయి.

2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీకి జరిగిన గాయంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టనుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి శనివారం వెల్లడించారు. దీంతో అప్పటి ఎన్నికల్లో రాజకీయ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మమతా బెనర్జీ గాయాన్ని డ్రామాగా సువేందు అభివరించారు. బంగూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో చేసిన వైద్య పరీక్షల నివేదికలో ఎముక విరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. 

..నబన్నాలోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీకి సంబంధించిన వైద్య నివేదికను ఆయన ప్రదర్శించారు. “2021లో నందిగ్రామ్‌లో ప్రచారం సందర్భంగా మమతా బెనర్జీ తన కాలికి గాయం అంటూ నాటకానికి తెరలేపారు. ఫ్రాక్చర్, డిస్లోకేషన్‌కు ఎలాంటి ఆధారం లేదని వైద్య నివేదికలో ఉంది. ఈ విషయంపై మేము దర్యాప్తు ప్రారంభిస్తాం. ఆమె చేసిన తప్పుడు ఆరోపణ నందిగ్రామ్ ప్రజలను అవమానించింది. అక్టోబర్ 9న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ముగిసిన తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తా’’ అని సువేందు తెలిపారు.

2021లో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 10న నందిగ్రామ్‌లోని రేయాపారా, బిరులియా ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గాయపడ్డారు. ఆ సమయంలో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తనను కారు తెరిచి ఉన్న తలుపు వైపు నెట్టారని.. పెద్ద సంఖ్యలో ప్రజలు చుట్టుముట్టిన సమయంలో ఆ కారు తలుపు తన ఎడమ కాలికి బలంగా తగిలిందని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో కూడా ఆమె ఇదే తరహా వివరణ ఇచ్చారు. ప్రజలకు అభివాదం చేస్తుండగా ప్రజలు తన వాహనాన్ని చుట్టుముట్టారని.. ఆ సమయంలో తన కాలు కారు తలుపు మధ్య నలిగిపోయిందని ఆమె చెప్పారు.

ఆమెను కోల్‌కతాకు తరలించి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి వైద్య నివేదికల ప్రకారం, ఆమె ఎడమ చీలమండ, పాదానికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కుడి భుజం, ముంజేయి, మెడ, నడుము ప్రాంతాల్లో కూడా గాయాలు, నొప్పి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎక్స్‌రే, ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించగా, బంగూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్‌లో కూడా ఎంఆర్ఐ చేశారు. మార్చి 12న ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె ఎడమ కాలికి ప్లాస్టర్ వేసి ఉండగా, ఆ తర్వాత వీల్‌చైర్‌లోనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు.

ఇదీ చదవండి: కారులో సీఎన్‌జీ నింపుతుండగా బిగ్ బ్లాస్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement