ఇంట్లో అగ్నిప్రమాదం.. ఎమ్మెల్యేకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు | Bengal MLA Bairon Biswas Injured After Fire Breaks Out At His Murshidabad Home, Investigation Underway | Sakshi
Sakshi News home page

ఇంట్లో అగ్నిప్రమాదం.. ఎమ్మెల్యేకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు

Oct 3 2026 3:24 PM | Updated on Oct 3 2026 3:46 PM

Byron Biswas injured after fire breaks out at his Murshidabad home

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా ధులియాన్‌లో శనివారం ఉదయం సాగర్‌దిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే బైరన్ బిశ్వాస్ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే బైరన్ బిశ్వాస్ గాయపడ్డారు. మంటల కారణంగా ఆయన శరీర దిగువ భాగంలో కాలిన గాయాలు కనపడినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కుటుంబంలోని ఇతర సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. ఇంటి నుంచి భారీగా నల్లటి పొగ వెలువడటాన్ని స్థానికులు గమనించారు. గాయపడిన బైరన్ బిశ్వాస్‌ను తొలుత ధులియాన్‌లోని కుటుంబానికి చెందిన నర్సింగ్‌హోమ్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించే అవకాశం ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

అగ్నిప్రమాదం ఎలా మొదలైంది, బైరన్ బిశ్వాస్‌కు ఏ విధంగా గాయాలు అయ్యాయన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బైరన్ బిశ్వాస్ ఇటీవల రాజకీయ పరిణామాల కారణంగా కూడా వార్తల్లో నిలిచారు. ఆయన రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అంతకుముందు ఆయన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ ఘటనపై స్పందిస్తూ.. “నేను తెలుసుకుంటాను. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని మీడియాతో అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి స్పందిస్తూ.. “నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఆసుపత్రికి వెళ్తాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తాను” అని తెలిపారు. ప్రస్తుతం బైరన్ బిశ్వాస్ ఆరోగ్య పరిస్థితిపైనే ప్రధానంగా దృష్టి ఉంది. అదే సమయంలో అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని నిర్ధారించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement