మిజోరం రాజధాని ఐజ్వాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు కేంద్ర ప్రభుత్వ అధికారులు మృతి చెందారు. మృతుల్లో ఐజ్వాల్ దూరదర్శన్ వార్తల విభాగం డైరెక్టర్ నాంపిబౌ మారిన్‌మై, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ ఎంగమ్ పామే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్‌కు చెందిన ఉద్యోగి హెచ్. లియాన్‌వెలా ఉన్నారు.
గురువారం ఐజ్వాల్‌కు దక్షిణంగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని సాటేక్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదంలో కారు నడుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఐజ్వాల్ కార్యాలయానికి చెందిన గోజేంద్ర దే తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఐజ్వాల్ సమీపంలోని ఫాల్కాన్‌లో ఉన్న జోరామ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్పించారు.
పామే సోదరుడు గతంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన జ్ఞాపకార్థం సియాల్సుక్ గ్రామంలో చెట్టు నాటిన అనంతరం నలుగురూ ఐజ్వాల్‌కు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పీఐబీ అధికారి తెలిపారు. కారు నడుపుతున్న సమయంలో గోజేంద్ర దే అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన చేతులు, కాళ్లు కదపలేకపోవడంతో పాటు కళ్లు తెరవలేకపోయారని అధికారి వెల్లడించారు. ఆ తర్వాత వాహనం రహదారి నుంచి పక్కకు వెళ్లి లోయలో పడిపోయింది.
ముగ్గురి మృతదేహాలను గురువారం రాత్రి జోరామ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. శుక్రవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నాంపిబౌ మారిన్‌మై, ఎంగమ్ పామేల మృతదేహాలను వారి స్వస్థలాలైన మణిపూర్‌కు తరలించారు.
మిజోరం జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు ఆసుపత్రిని సందర్శించి మృతులకు నివాళులర్పించారు. మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా, మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు జోరామ్‌థంగా, మిజోరం కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్ థాంజారా కూడా ముగ్గురి మృతికి సంతాపం తెలిపారు.


