కారులో చెలరేగిన మంటలు
గుంటూరులో విషాదం
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): గుంటూరు నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారులో మంటలు చెలరేగి కుమారుడి కళ్లెదుటే తండ్రి సజీవ దహనమైన ఘటన అందరినీ కలచివేసింది. కారులోని ఏసీ పేలడం వల్ల లేదా ఇతర సాంకేతిక లోపం వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. మంటల తీవ్రతకు కారు డోర్లు లాక్ అయినట్టు తెలుస్తోంది. స్థానికులు అప్రమత్తమై కారు అద్దాలు పగలగొట్టి డ్రైవింగ్ సీటులో ఉన్న అఖిలేష్‌ను కాపాడగలిగారు.
వెనుక సీటులో ఉన్న ఆయన తండ్రి హరికృష్ణ కారులోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని ఐపీడీ కాలనీ సమీపంలోని సాయిబాబా గుడివద్ద మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. కాటన్ వ్యాపారం చేసే తాడికొండ హరికృష్ణ (53) సంగడిగుంట ఐపీడీ కాలనీలోని సాయిదుర్గ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుమారుడు అఖిలేష్ మంగళవారం కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు అందుబాటులో లేక తిరిగి వస్తుండగా, ఒక్క నిమిషంలో అపార్టుమెంట్‌కు చేరుకునేంత దూరంలో కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన స్థానికులు అఖిలేష్ ను బయటకులాగే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హరికృష్ణ కారులోనే సజీవ దహనం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన లాలాపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


