వేతన బిల్లుపై ప్రిన్సిపాల్ సంతకం నాలుగు నెలలుగా ఫోర్జరీ విధులకు రాకుండానే జీతం పొందిన డైలీ వేజ్ ఉద్యోగి ఫిర్యాదు చేసినవారు, ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారి మౌనముద్ర ఘటనను కప్పిపుచ్చేందుకు తెరపైకి బదిలీ వ్యవహారం ఉన్నతాధికారులు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు
విచారణకు ఆదేశిస్తున్నాం
వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చిన్న అవినీతి ఘటన వెలుగులోకి వచ్చినా యంత్రాంగం వెంటనే స్పందించేంది. కఠినమైన చర్యలు తీసుకునేది. వ్యవస్థలో ఎవ్వరు తప్పు చేసినా చర్యలు తప్పవనే సందేశం ఇచ్చేది. కానీ నేడు కొందరి వ్యవహారశైలి వర్సిటీకి మాయనిమచ్చలా మారుతున్నా యంత్రాంగం మౌనం వహిస్తోంది. అవినీతి ఘటనలు వెలుగులోకి వచ్చినపుడు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని కప్పిపుచ్చుతూ అవినీతిపరులను రక్షిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకరు తప్పు చేస్తే కమిటీ విచారణ పేరుతో హంగామా చేసే అధికారులు ఆ తప్పు మరొకరు చేస్తే గోప్యంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: యూనివర్సిటీలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనే ఉన్నతాధికారుల పక్షపాతానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగిని కాపాడటంతోపాటు మరొక డిపార్ట్‌మెంట్‌కు పంపించి చేతులు దులుపుకొంటున్నారు. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో విధులు నిర్వహించే ఒక రోజువారీ వేతన ఉద్యోగి విధులకు హాజరుకాకుండానే వేతనం పొందటం, వేతన బిల్లులపై ప్రిన్సిపాల్ సంతకం ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేసే డైలీ వేజ్ ఉద్యోగి విధులకు రావడం లేదని ఉన్నతాధికారులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల ఫిర్యాదు చేశారు. విధులకు రాని ఉద్యోగి స్థానంలో మరొకరిని నియమించాలని కోరారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు వివరాలు పరిశీలించగా కొన్ని నెలలుగా విధులకు హాజరుకాకుండానే హాజరైనట్లు వేతన బిల్లులు పెట్టడం, వాటిపై ప్రిన్సిపాల్ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే రోజువారీ వేతన ఉద్యోగులకు సంబంధించిన వేతనాలకు సంబంధించిన చెక్కు అకౌంట్స్ సెక్షన్ నుంచి బ్యాంకుకు వెళ్లింది. దీంతో యూనివర్సిటీ అధికారులు బ్యాంకు అధికారులతో మాట్లాడి చెక్కును వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన వర్సిటీలో కలకలం రేపింది.
మౌనం వెనుక మతలబు ఏంటో?
ఈ ఘటనలో ఫిర్యాదుదారులు, దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ఉన్నతాధికారి ఉద్దేశపూర్వకంగా మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘‘ వర్సిటీలో ఏ ఘటన జరిగినా నేను విచారణ చేస్తా. చర్యలు తీసుకోవాల్సిందే’’ అంటూ ఆ ఉన్నతాధికారి హడావుడి చేస్తారనే ప్రచారం ఉంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కూడా ఆయన ఇదే చేశారు. కొందరు ఆయనను ప్రత్యేకంగా కలిసి ఏకాంతంగా చర్చించారని, తరువాత పరిస్థితి అంతా మారిపోయిందని వర్సిటీలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మరోపక్క ఫిర్యాదు చేసిన వారు కూడా ప్రస్తుతం నోరు మెదపడం లేదు. వర్సిటీలో అన్నీ తానే నడిపిస్తున్నానని, ఉన్నతాధికారులైనా తన అభిప్రాయం తీసుకోవాల్సిందే అని చెప్పుకొనే ఓ వ్యక్తి ఈ వ్యవహారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయిందని కూడా కొందరు చెప్పుకొస్తున్నారు. నాడు చర్యలు తీసుకోవాల్సిందే అని హడావుడి చేసిన చేసిన వారే నేడు ‘‘ అయ్యోపాపం.. ఉద్యోగాలతో పని కదా! చర్యలు ఎందుకులే... ఆ విషయం తరువాత చూద్దాం...’’ అంటున్నారని తెలిసింది. మరికొన్నిచోట్ల తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. ఆ ఉద్యోగిని ఇంజినీరింగ్ కళాశాల నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసే ప్రయత్నాలు రహస్యంగా ప్రారంభించారని తెలుస్తోంది. ఈ పరిణామాలపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులకు అండగా నిలవడం ద్వారా ఉన్నతాధికారులు వ్యవస్థను నాశనం చేస్తున్నానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ నియోజకర్గంలో ఉన్న ఏఎన్‌యూలో అక్రమాలు, ఫోర్జరీలు సర్వసాధారణంగా మారడం చూస్తుంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
నా సంతకం ఫోర్జరీ అయిన వ్యవహారంపై విచారణ కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం.
– లింగరాజు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్


