76 డివిజన్లలోనూ పార్టీ అభ్యర్థులే గెలవాలి మేయర్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు సమష్టిగా పనిచేద్దాం పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పిలుపు ‘స్థానిక’ ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలతో సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ గెలుపు జెండా ఎగురవేద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమాలు పిలుపునిచ్చారు. మంగళవారం సిద్ధార్థనగర్‌లోని అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల వారీగా పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో కార్పొరేషన్ ఎన్నికలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, షేక్ నూరి ఫాతిమాలు మాట్లాడుతూ.... గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని 76 డివిజన్లలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించుకునేందుకు కసితో పని చేయాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు నగరపాలక సంస్థను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో దానిని రిపీట్ చేయాలన్నారు. నాడు వైఎస్ జగన్ పాలనలో అమలు చేసిన పథకాలు ప్రస్తుతం లేవని, ప్రతి కుటుంబానికి జరిగిన మేలుతోపాటు కూటమి పాలనలో గడ్డు కాలం ఎదురైన పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మేయర్ పీఠాన్ని కై వసం చేసుకుని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుంటూరు కార్పొరేషన్ విజయాన్ని కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అభ్యర్థి ఎవరైనప్పటికీ ప్రజలకు కనిపించేది వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. పార్టీ కోసం నిలబడేవారే నిజమైన కార్యకర్తలని తెలిపారు.
ఆశావహుల సందడి
సమావేశంలో భాగంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అంబటి రాంబాబు ఎదుట పోటీ పడ్డారు. పలువరు తమ బయోడేటాలను బుధవారం సాయంత్రంలోపు గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తలకు అందజేయాలని ఆయన సూచించారు. మొత్తం 76 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల బయోడేటాలను అక్టోబర్ ఒకటో తేదీన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేస్తామని తెలిపారు. అభ్యర్థుల ఖరారుపై పార్టీ అధినేత తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, నాయకులు పాల్గొన్నారు.


