శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన మెమో
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం మరింతగా కక్షసాధింపు
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా జాబితాల సేకరణ
మరోవైపు ధర్నాలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులకు మెమోలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం మరింతగా కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే విజయవాడలో జరిగిన ధర్నాలో పాల్గొన్న పలువురు ఉద్యోగులపై పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించిన ప్రభుత్వం.. తాజాగా ఆ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులందరి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 27వ తేదీ విజయవాడలో నిర్వహించిన ధర్నాకు అనుమతి లేకపోయినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆ ధర్నాలో పాల్గొన్నారని ఎత్తి చూపుతూ ప్రభుత్వం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కార్యాలయం సోమవారం ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలు జారీ చేయగా.. ఆయా జిల్లాల కలెక్టర్ల సూచనతో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల నుంచి మండలాలు, పట్టణాల వారీగా మంగళవారం సాయంత్రానికే జాబితాలు సేకరించి పంపారు. తమ సమస్యల గురించి రెండేళ్లుగా పలుమార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు 27వ తేదీ ఆదివారం ‘ఛలో విజయవాడ’ చేపట్టారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో మరింతగా కక్ష గట్టింది.
వాస్తవానికి 27వ తేదీ ఆదివారం ఉద్యోగులకు సెలవు. అయినప్పటికీ వారంతా ఆ రోజు ఎక్కడ ఉన్నారని ప్రభుత్వం ఆరా తీయడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సచివాలయ ఉద్యోగుల తీవ్ర స్థాయి ఆందోళనల నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి ఏమైనా ఇబ్బందులెదురవుతాయా.. అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంది. పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. మరో వైపు ప్రభుత్వం ఈ నెల 27న విజయవాడ ధర్నాలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మేజర్ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న 9 మంది సచివాలయ ఉద్యోగులకు మెమోలు ఇచ్చింది. మీకు జీతాలు ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని అడగడం కలకలం రేపుతోంది.


