కోల్‌కతా: తమిళనాడులో పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే సంచలన విజయం సాధించిన టీవీకే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పాగా వేసే ప్రయత్నాలు ఆరంభించింది. తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ పశ్చిమ బెంగాల్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు టీవీకే పార్టీ కార్యాలయాన్ని పుర్బా బర్ధమాన్ జిల్లాలోని బర్ధమాన్‌లో ఆదివారం ప్రారంభించారు.
ఈ కార్యాలయాన్ని ఆ పార్టీ బెంగాల్ స్టేట్ కో-ఆర్డినేటర్ చైతాలి రాయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
ప్రస్తుతానికి రాజకీయ కార్యకలాపాల కంటే కూడా సామాజిక సేవ, సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాధారణ ప్రజలకు చేరువ కావడమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు అంటున్నారు.
మరొకవైపు ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో టీవీకే పార్టీ యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పుర్బా బర్ధమాన్ జిల్లాతో పాటు బీర్బం, బంకురా, పురూలియా జిల్లాల్లో ఆ పార్టీ చురుగ్గా సామాజిక కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు సమాచారం.
ఈ ఏడాది వెస్ట్ బెంగాల్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. దాంతో అప్పటివరకూ తనకు తిరుగులేదనుకున్న తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లతో అధికారం చేజిక్కించుకోగా, తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమై ఘోర ఓటమి పాలైంది.
అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో ఆ రెండు పార్టీలకు ప్రత్నామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తున్న టీవీకే.. అందుకు తగ్గ రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకునే క్రమంలో తొలి అడుగు వేయడంతో ఆ పార్టీ మరోసారి వార్తల్లో నిలిచింది. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగానే ఇప్పట్నుంచే ఆ పార్టీ తమ కార్యాచరణను ఆరంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: అక్టోబర్ 2న ‘జైల్ భరో’కు సీజేపీ నేత అభిజీత్ దీప్కే పిలుపు!


