‘సాక్షి’ ఇంటర్వ్యూలో కాక్రోచ్ జనతా పార్టీ దక్షిణ భారత ప్రతినిధి విజయ్ మల్లంగి
భారత రాజకీయ యవనికపై సరికొత్తగా దూసుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విలక్షణ వ్యూహాలతో అతి తక్కువ కాలంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరగాల్సిందేనని సీజేపీ దక్షిణ భారత ప్రతినిధి, మీడియా విభాగం లీడ్ విజయ్ మల్లంగి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2029లోపు దేశంలో
ప్రభుత్వాన్ని జవాబుదారీ చేస్తామని ధీమాగా వెల్లడించారు. సంప్రదాయరాజకీయ సమీకరణాలను తిరగరాస్తూ, సామాన్యుడి గొంతుకగా మారతామని చెబుతున్న ఈ పార్టీ ప్రస్థానం, తెలుగు రాష్ట్రాల్లో చేపట్టబోయే కార్యాచరణ గురించి ఆయన మాట్లాడారు. – సాక్షి, హైదరాబాద్
సాక్షి: ఏపీలో డీఎస్సీ అవకతవకల గురించి పెద్ద యుద్ధమే జరుగుతోంది. మీ పార్టీ తరఫున ఏం చేయాలనుకుంటున్నారు?
విజయ్: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు, పోలీస్ నియామకాలు, ఇతర స్థానిక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. నిరసన తెలిపినందుకు మా జోనల్ కోఆర్డినేటర్ నిమ్మకాయల భాస్కర్ మీద కేసు పెట్టారు. ఏ ఒక్కరు నిరసన తెలిపినా వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా సోషల్ మీడియా పేజీలను తీసిపడేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చెప్పినా మెటా నోటీసులు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగదు. జర్నలిస్టులపైనా దాడులు జరుగుతున్నాయి. అక్టోబర్ 3–5 మధ్య ఏపీలో పర్యటిస్తాం. బాధితులను కలుస్తాం. తదుపరి కార్యాచరణ చేపడతాం.
తెలుగు రాష్ట్రాల్లో మీరు గుర్తించిన సమస్యలు?
బడులు ఇంకా బాగుపడాలి. శానిటేషన్ పరంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే నెల పర్యటిస్తాం. తెలంగాణలో మధ్యాహ్న భోజనం సిబ్బంది వేతనాలు రూ.3వేల నుంచి రూ.12వేలు చేస్తామని హామీ ఇచ్చారు.. దీనిపై ప్రభుత్వానికి వినతిపత్రాన్ని ఇస్తాం. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పెచ్చులు ఊడిపడి ఆరు మందికి గాయాలయ్యాయి. అసలు అలాంటివి జరగకూడదు. దానికి ఎదురుగా ఉన్న 24 అంతస్తుల వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
సీఈసీ రాజీనామా చేయకపోతే మీరేం చేస్తారు?
అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఎస్‌ఐఆర్‌తో ప్రాంతీయ పార్టీలకు నష్టం చేకూరిందో అక్కడికి వెళతాం. 400 సీట్లు ఆశించిన బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. దీంతో ఏదో విధంగా ప్రాంతీయ పార్టీల్లో ఉన్నవాళ్లని ఓడించాలని ఫిక్స్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఇదే జరిగింది. ఇందుకోసం వ్యూహాత్మకంగా ఈసీని వాడుకున్నారు. దీనిపై అందరం కలిసి పోరాడాలి.
రాజకీయాలను జెన్–జీ అర్థం చేసుకోగలదా?
యువతకు ఆకాంక్షలు ఎక్కువ. జెన్ జీ ’నో’ చెప్పడం నేర్చుకుంది. ఎదిరించి, పోరాడి, ప్రశ్నించే వైఖరి కనిపిస్తోంది. కాబట్టి వాళ్లలో అంత రాజకీయ నైపుణ్యత అక్కర్లేదు. రాజకీయాలు ఉన్నవి మంచి కోసం. అది చేయనప్పుడు దాన్ని ప్రశ్నిస్తున్నారు. అది కూడా సృజనాత్మకంగా. వాళ్లు తమ ఐడెంటిటీని కొనసాగిస్తూ నిరసన చేస్తున్నారు.
దేశంలో జెన్–జీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది?
2029 ఎన్నికల కంటే ముందే మీరు చూడబోతున్నారు. ప్రభుత్వం ఎక్కువ జవాబుదారీతనంతో పని చేయబోతుంది. మేము స్కూళ్లు సందర్శించడం మొదలుపెడుతూనే ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్‌లో ప్రభుత్వం పాఠశాలలకు నిధులు కేటాయించింది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారికి ఫలితం కావాలి. ప్రజలు అలసిపోయారు. యువతకు ఉద్యోగాలు కావాలి. ఎన్నికల సంస్కరణలు రావాలి. ఎన్నికల నిర్వహణ పాదర్శకంగా ఉండాలి.
ఎవరు ఓటు వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. దానిపై మీ కార్యాచరణ ఏంటి?
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ప్రభుత్వం ప్రజలను ఎన్నుకోవడం విడ్డూరంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లోనే సెలెక్టివ్‌గా ఆగమేఘాల మీద ఓట్లను తొలగిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఎజెండా ఏంటి? మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక్క ఓటు ఉన్నా ఆయన ఓటు వేయడానికి మొత్తం యంత్రాంగం అంతా వెళ్లి నిలబడుతుంది. అలాంటిది ఒక్క ఓటు కూడా మిస్ అవ్వద్దు కదా. జనాలకు విశ్వాసం లేదు. బతికున్న వాళ్లను కూడా చనిపోయారని జాబితా నుంచి తీసేస్తున్నారు.
ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను గుప్పెట్లో పెట్టుకొని దొంగగా గెలవాలనుకుంటే లాభం లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరగాలి. ఆయన రాజీనామా చేయాలి. అసలు ఆయనను ఎవరు చేయనిచ్చారు ఇవన్నీ? ఎవరో అనుమతిస్తేనే కదా ఆయనకి ఇంత ధైర్యం వచ్చేది. ఇప్పుడు ఎవరో నింద మోపట్లేదు. 14 సార్లు మీటింగ్ జరిగితే 10 సార్లు తాము ఏకీభవించలేదని సాక్షాత్తు ఆయన పక్కనున్న ఇద్దరు ఎన్నికల కమిషనర్లే చెప్తున్నారు. భయంతో అధికారులు ఈ విషయాలను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. భయాందోళనలకు గురిచేసే ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువగా దీనిపై పోరాడాలి.
ప్రెజర్ గ్రూప్‌గానే ఉంటారా? రాజకీయ పార్టీగా అవతరిస్తారా?
ఈ పొద్దు ప్రెజర్ గ్రూప్. రేపు ఏమవుతుందో తెలీదు. వలంటీర్స్ ఏం చెప్తే అది.
నిరసన వల్ల నిజంగా మార్పు వస్తుందా?
వచ్చింది కదా. ధర్మేంద్ర ప్రధాన్ ‘రాజీనామా చేయను’ అన్నారు. ఈ ప్రభుత్వంలో రాజీనామాలే జరగవన్నారు. అలాంటిది చేయాల్సి వచ్చింది. ఇప్పుడు భయంతో పని చేస్తున్నారు.
మీకు ఒక ఆఫీస్ అంటూ లేదు. మరి ఎలా రన్ చేస్తారు?
గూగుల్ మీట్, జూమ్ కాల్, ఫోన్, వాట్సాప్.. మాకు ఇవి చాలు.
మీరు రాజకీయ పార్టీగా మారితే ఎజెండా ఏంటి?
ఇప్పటికిప్పుడైతే పార్టీగా మారే ఆలోచన, ఆసక్తి లేవు. ప్రజలు, వలంటీర్లు మమ్మల్ని ఎలా చూడాలన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది.
విపక్ష ఇండియా కూటమితో చేతులు కలిపే అవకాశం ఉందా?
ఇండియా అలయన్స్ అని సెపరేట్‌గా ఏం లేదు. ఏ పార్టీతోనూ పొత్తు లేదు. ఇండియా మొత్తం మా అలయన్సే.


