కొత్త వైరస్‌లొస్తే ఖతమే | CSIR-IICT Director Dr Srinivasa Reddy Coments in Sakshi Interview | Sakshi
Sakshi News home page

కొత్త వైరస్‌లొస్తే ఖతమే

Sep 27 2026 2:44 AM | Updated on Sep 27 2026 2:44 AM

CSIR-IICT Director Dr Srinivasa Reddy Coments in Sakshi Interview

యాంటీ–వైరల్‌ మిషన్‌తో భవిష్యత్‌ మహమ్మారులకు చెక్‌  

దేశీయ ఎమ్మార్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ప్లాట్‌ఫామ్‌ ఇక్కడే సిద్ధం  

దీంతో కొత్త వైరస్‌ వస్తే కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్‌ డిజైన్‌ 

అత్యంత ప్రమాదకర వైరస్‌లపైనా రిస్క్‌ లేకుండా ప్రయోగాలు 

యాంటీ–వైరల్‌ మిషన్‌ దేశ వైద్య, సైన్స్‌ రంగాల్లో మైలురాయి 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ డైరెక్టర్‌ డా.శ్రీనివాసరెడ్డి

కె.రాహుల్‌  
భవిష్యత్‌లో కరోనా వంటి మహమ్మారులు ముంచుకొస్తే మన సన్నద్ధత ఏమిటి? వైరస్‌లను ల్యాబ్‌లోనే తుదముట్టించే వ్యూహం ఉందా? వీటికి సమాధానం హైదరాబాద్‌లోని రెండు దేశీయ అత్యున్నత ల్యాబ్స్‌ సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ), సీఎస్‌ఐఆర్‌–సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ) సంయుక్తంగా చేపట్టిన ‘యాంటీ–వైరల్‌ మిషన్‌’. రాబోయే 10–20 ఏళ్లలో ప్రపంచాన్ని పట్టిపీడించే సరికొత్త వైరస్‌లను, అపరిచిత మహమ్మారులను ఎదుర్కొనేందుకు దేశాన్ని సన్నద్ధం చేయడం ఈ మిషన్‌ లక్ష్యం. వైరస్‌ బయాలజీని, అది శరీరంలో ఎలా వ్యాప్తి చెందుతుందో హైదరాబాద్‌లోని సీసీఎంబీ పరిశోధిస్తే... దాన్ని చంపే కెమికల్‌ ఫార్ములాను ఐఐసీటీ ల్యాబ్‌ తయారు చేస్తోంది. దీంతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. విదేశీ టెక్నాలజీతో సంబంధం లేకుండా దేశీయంగానే ఎమ్మార్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఇక్కడే సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో కొత్త వైరస్‌ వస్తే కేవలం కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్‌ డిజైన్‌ చేయొచ్చు. సాధారణంగా కొత్త మందులు కనిపెట్టడానికి 10–12 ఏళ్లు పడుతుంది. అందుకే ఇప్పటికే మార్కెట్లో సురక్షితంగా ఉన్న పాత మందులనే కొత్త వైరస్‌ల నివారణకు వాడేలా పరిశోధనలు వేగవంతంగా జరుపుతున్నాం. అతిప్రమాదకర  వైరస్‌లపైనా రిస్క్‌ లేకుండా ప్రయోగాలు చేసేందుకు వీలుగా హైసెక్యూరిటీ బయో–సేఫ్టీ–3 (బీఎస్‌ఎల్‌–3) ల్యాబ్స్‌ ఈ మిషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ డైరెక్టర్‌ డా.డి.శ్రీనివాసరెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. 

ప్రశ్న: ఇతర వ్యాధుల కోసం మార్కెట్లో ఉన్న సురక్షిత ఔషధాలను కొత్త వైరస్‌లపై పునర్వినియోగించడంలో మీ పరిశోధన ఏ దశకు చేరుకుంది? 
జవాబు: ఇతర అనారోగ్య సమస్యలున్న కోవిడ్‌–19 రోగులపై ఉమిఫెనోవిర్, నిక్లోసమైడ్, కొల్చిసిన్‌ వంటి ఔషధాలతో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం ద్వారా సీఎస్‌ఐఆర్‌ గణనీయమైన ప్రయత్నాలు చేసింది. సన్‌ ఫార్మా, ఐసీజీఈబీలతో కలిసి ఫైటోఫార్మాస్యూటికల్‌పైనా క్లినికల్‌ ట్రయల్‌ నిర్వహించాం. అలాగే అశ్వగంధ సహా మూడు ఆయుష్‌ ఔషధాలను సార్స్‌–కోవ్‌–2 నివారణ వినియోగం కోసం క్లినికల్‌ విధానంలో మూల్యాంకనం చేశాం. ఫలితంగా ప్రజలకు ఔషధాలు త్వరితగతిన అందుబాటులోకి వచ్చే అవకాశముంది. 

ప్రశ్న: వ్యాక్సిన్‌ అభివృద్ధిలో అత్యంత ప్రభావవంతంగా నిలుస్తున్న ఎమ్మార్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ సాంకేతికతను హైదరాబాద్‌ ప్రయోగశాలల్లో స్వదేశీయంగా అభివృద్ధి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఏమంటారు? 
జవాబు: అవును, నిజమే. ఎమ్మార్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ డెలివరీలో అత్యంత కీలకమైన భాగం ’అయనీకరణ లిపిడ్లు’. వీటిని ఐఐసీటీ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం మా వద్ద కొన్ని స్వదేశీ లిపిడ్లు ఉన్నాయి. వాటిని జంతు నమూనాల్లో కూడా విజయవంతంగా పరీక్షించాం. నూతన యాంటీజెన్‌ ఎమ్మార్‌ఎన్‌ఏ నిర్మాణ భాగాన్ని సీసీఎంబీ చేపడుతోంది. ఈ రెండు సంస్థలు కలిసి, భారీ స్థాయి ఉత్పత్తికి అనువైన ఎమ్మార్‌ఎన్‌ఏ–ఎల్‌ఎన్‌పీ ప్లాట్‌ఫామ్‌ సాంకేతికతను రూపొందించాయి. కొత్త వైరస్‌ వెలుగుచూస్తే కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్‌ను సిద్ధం ప్లాట్‌ఫామ్‌ను మనం సిద్ధం చేస్తున్నాం. 

ప్రశ్న: కోవిడ్‌ అనంతర కాలంలో భవిష్యత్‌ వైరస్‌లను ఎదుర్కొనేందుకు సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్తంగా ప్రారంభించిన యాంటీ–వైరల్‌ మిషన్‌ పురోగతి ఎలా ఉంది? 
జవాబు: సార్స్‌–కోవ్‌–2పై పనిచేసే నూతన చికిత్సా ఔషధాలను కనుగొని, అభివృద్ధి చేసే లక్ష్యంతో 10 సీఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలల భాగస్వామ్యంతో ’సీఎస్‌ఐఆర్‌ యాంటీవైరల్‌ మిషన్‌ (2021–25)’ను పాన్‌–సీఎస్‌ఐఆర్‌ కార్యక్రమంగా ప్రారంభించాం. ఇందులో ఐఐసీటీ, ఎన్‌ఐఐఎస్టీ, ఎన్సీఎల్, ఐఐఐఎం, ఐఐసీబీ, సీఎల్‌ఆర్‌ఐ, సీడీఆర్‌ఐ, ఇహ్‌బాస్‌ (ఐహెచ్‌బీటీ), సీసీఎంబీ, యూఆర్డీఐపీ సంస్థలు పాల్గొన్నాయి. ఈ మిషన్‌కు ఐఐసీటీ నోడల్‌ ప్రయోగశాలగా వ్యవహరించింది. 1,300 నూతన అణువులను సంశ్లేíÙంచి, వాటి యాంటీవైరల్‌ సామర్థ్యాన్ని పరీక్షించాం. ఈ మిషన్‌ ద్వారా 13 నూతన పేటెంట్‌ దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రస్తుతం పరిశ్రమల ఆర్థిక సహకారంతో చేపట్టిన రెండో దశలో నాలుగు చిన్న అణువులు, ఒక ఫిక్సŠడ్‌ డోస్‌ కాంబినేషన్‌ ప్రీక్లినికల్‌ అభివృద్ధి దశలో ఉన్నాయి. 

ప్రశ్న: ప్రమాదకరమైన వైరస్‌ కల్చర్ల నిర్వహణకు, పరీక్షించడానికి అవసరమైన బీఎస్‌ఎల్‌–3 ప్రయోగశాల పురోగతి ఎలా ఉంది? 
జవాబు: సీసీఎంబీ, ఐఐబీటీ సంస్థలు అత్యాధునిక బీఎస్‌ఎల్‌–3 సదుపాయాలను ఏర్పాటు చేసి, సార్స్‌–కోవ్‌–2 యాంటీవైరల్‌ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాయి. 

ప్రశ్న: భారత్‌ ప్రపంచ ఫార్మా హబ్‌గా పేరొందినప్పటికీ, ఔషధ తయారీలో వాడే కీలక ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? 
జవాబు: యాంటీవైరల్‌ మిషన్‌ ప్రధానంగా నూతన ఔషధ ఆవిష్కరణ లక్ష్యంగా చేపట్టిందే అయినప్పటికీ, ఇతర సీఎస్‌ఐఆర్‌ నిధులతో మా ప్రయోగశాలలు ఫావిపిరావిర్‌ వంటి కీలక యాంటీవైరల్‌ ఔషధాల తయారీ ప్రక్రియలను అభివృద్ధి చేసి పరిశ్రమలకు బదిలీ చేశాయి. అంతేకాకుండా, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు పదేళ్లుగా సీఎస్‌ఐఆర్‌ ప్రత్యేక మిషన్‌పై దృష్టి పెట్టింది. పారాసిటమాల్‌ సహా పలు కీలక ఔషధ ప్రక్రియలను స్వదేశీ తయారీ కోసం పరిశ్రమలకు ఇప్పటికే బదిలీ చేశాం. 

ప్రశ్న: భవిష్యత్‌ యాంటీవైరల్‌ ఔషధాలు తక్కువ ధరలో లభిస్తాయా?  
జవాబు: అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫావిపిరావిర్‌ తయారీ సాంకేతికతను అభివృద్ధి చేసి సిప్లాకు సీఎస్‌ఐఆర్‌ బదిలీ చేసింది. అలాగే వ్యాక్సిన్‌ అడ్జువెంట్‌ తయారీ సాంకేతికతను భారత్‌ బయోటెక్‌కు బదిలీ చేస్తే, వారు దానిని కోవాగ్జిన్‌ తయారీలో వినియోగించారు. యాంటీవైరల్స్‌ మాత్రమే కాకుండా, అందరికీ అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించే లక్ష్యంతో తక్కువ వ్యయంతో కూడిన ఏపీఐలు, కేఎస్‌ఎంల అభివృద్ధి కోసం సీఎస్‌ఐఆర్‌ పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 

ప్రశ్న: జంతువుల నుంచి మనుషులకు సోకే జూనోటిక్‌ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. వీటిని ఎదుర్కోవడానికి యాంటీ వైరల్‌ మిషన్‌ ఎలా ఉపయోగపడుతుంది? 
జవాబు: యాంటీవైరల్‌ మిషన్‌ మొదటి దశ 2025తో ముగిసినప్పటికీ, పలు వైరస్‌ కుటుంబాల్లో ఉమ్మడిగా ఉండే సంరక్షిత హోస్ట్, వైరల్‌ యంత్రాంగాలను లక్ష్యంగా చేసుకుని ’పాన్‌–వైరల్‌’ చికిత్సలపై పరిశోధనను ముందుకు తీసుకెళ్లాలని సీఎస్‌ఐఆర్‌ నిర్ణయించింది. ఇటువంటి బ్రాడ్‌–స్పెక్ట్రమ్‌ విధానాల వల్ల ’డిసీజ్‌ ఎక్స్‌’ వంటి తెలియని కొత్త వ్యాధికారకాలు వచ్చినా వేగంగా చికిత్స అందించడం సాధ్యమవుతుంది. మహమ్మారి వచ్చిన ప్రతిసారీ కొత్త ఔషధాన్ని సున్నా నుంచి తయారు చేయాల్సిన భారం తప్పుతుంది. 

ప్రశ్న: యాంటీ వైరల్‌ మిషన్‌ ప్రాజెక్టు అంతిమ లక్ష్యం ఏమిటి? ఇది హైదరాబాద్‌ను ఏ స్థాయికి చేరుస్తుంది? 
జవాబు: ప్రస్తుతం ఈ మిషన్‌ ముగిసినప్పటికీ, ఐఎన్డీ దరఖాస్తు దాఖలు చేసి క్లినికల్‌ ట్రయల్స్‌లోకి ప్రవేశించే లక్ష్యంతో టాప్‌–5 లీడ్‌ అణువుల ప్రీక్లినికల్‌ అభివృద్ధి ముమ్మరంగా సాగుతోంది. ఇది హైదరాబాద్‌ను ప్రపంచ ఔషధ ఆవిష్కరణ పటంలో అత్యున్నత స్థానంలో నిలబెడుతుంది. 

ప్రశ్న: జీవశాస్త్రంలో సీసీఎంబీ, రసాయన శాస్త్రంలో ఐఐసీటీ... ఈ రెండు దిగ్గజ సంస్థల సమన్వయం ఎలా సాగింది?   
జవాబు: సీసీఎంబీ తన బీఎస్‌ఎల్‌–3 సదుపాయం ద్వారా వైరల్‌ జీవశాస్త్రం, వ్యాధి యంత్రాంగాల మూల్యాంకనంలో పాలుపంచుకోగా; ఐఐసీటీ మెడిసినల్‌ కెమిస్ట్రీ, స్ట్రక్చర్‌–బేస్డ్‌ డ్రగ్‌ డిజైన్, చిన్న అణువుల ఆప్టిమైజేషన్‌లో కీలక పాత్ర పోషించాయి.  

ప్రశ్న: భవిష్యత్తులో కొత్త వైరల్‌ వేరియంట్లు వెలుగుచూస్తే, మన స్వదేశీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఎంత వేగంగా స్పందించగలం? 
జవాబు: మేము నెలకొల్పిన స్కేలబుల్‌ ఎమ్మార్‌ఎన్‌ఏ–ఎల్‌ఎన్‌పీ ప్లాట్‌ఫామ్‌ సాంకేతికత ప్రస్తుతం నాన్‌–జీఎల్పీ దశలో ఉంది. స్వదేశీ అయనీకరణ లిపిడ్లతో దీని పనితీరును ఇప్పటికే నిరూపించాం. భవిష్యత్తులో కొత్త వేరియంట్‌ వస్తే, దాని జన్యు క్రమం తెలిసిన వెంటనే కేవలం ఎమ్మార్‌ఎన్‌ఏ క్రమాన్ని మారిస్తే సరిపోతుంది. ఫార్ములేషన్, తయారీ ప్రక్రియలు ముందే సిద్ధంగా ఉంటాయి కాబట్టి, అతి తక్కువ సమయంలోనే కొత్త వ్యాక్సిన్‌ను సిద్ధం చేయడం సాధ్యమవుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement