వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములపై అధికార, విపక్ష నేతల కన్ను
హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం కొంగరకుర్దులో కబ్జా పర్వం... వివిధ శాఖల అధికారుల పూర్తి స్థాయి సహకారం
40 ఎకరాల భూమికి సంబంధించి నకిలీ ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ల సృష్టి
గత ఏడాది అక్టోబర్‌లో అనుమతులు మంజూరు చేసిన హెచ్‌ఎండీఏ అధికారులు
అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు మూడుసార్లు లేఖ రాసిన వక్ఫ్ బోర్డు సీఈవో
లేఅవుట్లకు సంబంధించిన సర్వే నంబర్లన్నీ వక్ఫ్ బోర్డు జారీ చేసిన గెజిట్‌లో ఉన్నవే..
తన సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఓఆర్‌సీలు సృష్టించారని పోలీసులకు ఐఏఎస్ అధికారి ఫిర్యాదు
ఇప్పటివరకు చర్యలు శూన్యం..
నేతలు ప్రభుత్వ స్థాయిలో చక్రం తిప్పుతున్నారనే అనుమానాలు
22ఏలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్!
తాము సాగు చేసుకుంటున్న భూముల్ని కాజేస్తున్నారంటూ రైతుల ఆవేదన
సాక్షి, హైదరాబాద్: అధికార పక్షం, విపక్షం అనే తేడా లేకుండా అంతా ఒక్కటయ్యారు. వందల కోట్ల విలువైన వక్ఫ్ భూమి కొల్లగొట్టడంలో కుమ్మక్కయ్యారు. ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్లు (ఓఆర్‌సీలు) సృష్టించారు. అయితే అవి నకిలీ ఓఆర్‌సీలని, ఆ సర్టిఫికెట్లపై ఏ అధికారి సంతకం ఉందో..ఆ అధికారే అది తన సంతకం కాదని, ఫోర్జరీ చేశారంటూ స్వయంగా పోలీస్‌స్టేషన్‌లో స్వయంగా ఫిర్యాదు చేశారు. కానీ చర్యల మాట అలా ఉంచితే ఇప్పటివరకు కనీసం కేసు కూడా నమోదు కాకపోవడం చూస్తుంటే.. ఈ భూములను కొల్లగొట్టడానికి ప్రభుత్వ స్థాయిలోనే చక్రం తిప్పుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, కొందరు నేతలతో పాటు ఓ మైనారిటీ నాయకుడు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. అప్పనంగా వక్ఫ్ భూములను కొట్టేయడమే పనిగా పెట్టుకున్న ఈ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నట్టు సమాచారం. ఎక్కడో కాదు నగర శివార్లలోని మహేశ్వరం మండలం కొంగరకుర్దు(ఏ)లో ఈ భూదోపిడీ తతంగం జరుగుతోంది. కొంగరకుర్దులో అక్రమంగా విక్రయాలు జరుపుతున్న లేఅవుట్లలో ఉన్న డిస్‌ప్లే బోర్డుల్లో పేర్కొన్న సర్వే నంబర్లు అన్నీ వక్ఫ్‌బోర్డు జారీ చేసిన గెజిట్‌లో ఉన్నవే కావడం గమనార్హం. అంతేకాదు ఈ భూములు 22ఏ లో ఉన్నప్పటికీ వాటిని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా రిజిస్ట్రేషన్లు చేసేస్తుండడం విస్మయం కలిగిస్తోంది.
వక్ఫ్ భూములన్నా, 22ఏ లో ఉన్నా..
హెచ్‌ఎండీఏ అధికారులు గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన ఫైల్ నంబర్ 0817/హెచ్‌ఎండీఏ/ఎస్‌డబ్లు్యడీఎల్/2025తో వక్ఫ్ భూములకు సంబంధించిన ఓ లే అవుట్‌కు అనుమతి మంజూరు చేశారు. దీన్ని గమనించిన వక్ఫ్ బోర్డు సీఈవో వెంటనే హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. 1989లో వక్ఫ్ బోర్డు జారీ చేసిన గెజిట్, 2007లో సవరించిన గెజిట్‌లను దానికి జత చేశారు. హెచ్‌ఎండీఏ జారీ చేసిన లే అవుట్‌ను రద్దు చేయాలని కోరారు. భవిష్యత్తులో సైతం వక్ఫ్‌బోర్డుకు చెందిన భూముల్లో ఎలాంటి లే అవుట్‌లకు అనుమతులు మంజూరు చేయరాదని సూచించారు. ఆ విధంగా ఇప్పటికి మూడుసార్లు లేఖ రాసినా హెచ్‌ఎండీఏ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుండడం గమనార్హం. వాస్తవంగా 22ఏ లో ఉన్న భూముల్లో లే అవుట్‌లకు కూడా ఎలాంటి అనుమతులూ మంజూరు చేయడానికి వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నా..ఇవేవీ హెచ్‌ఎండీఏ పట్టించుకోవడం లేదని స్పష్టం అవుతోంది. 
అనుమతులు రద్దు చేయాలంటూ వక్ఫ్‌బోర్డు సీఈవో రాసిన లేఖ
మొత్తం 40 ఎకరాల్లో లేఅవుట్లు
వక్ఫ్‌బోర్డుకు ఆ ప్రాంతంలో మొత్తం 400 ఎకరాల వరకు భూములుండగా..దాదాపు 41 ఎకరాల్లో లేఅవుట్‌లకు రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతి మంజూరు చేయడంపై వక్ఫ్‌బోర్డు సీఈఓ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదర్శ ఇన్‌ఫ్రా డెవలపర్స్ పేరుతో వండర్ విస్టా 16.35 ఎకరాల్లో లే అవుట్ చేసేందుకు అనుమతి మంజూరు చేశారని సీఈవో తన లేఖలో స్పష్టం చేశారు. అలాగే డెస్టినీ రియల్టర్స్ 25 ఎకరాల్లో వెంచర్ చేయడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భూములను కాపాడాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారికి, మహేశ్వరం మండల తహశీల్దార్‌కు, ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు కూడా ఆయన లేఖ రాశారు. అయినా ఎలాంటి ఫలితం లేదు.
అన్ని పార్టీల నేతలు..!
వక్ఫ్ భూమిని కాజేయడంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖునిగా చెలామణి అవుతున్న ఓ మైనారిటీ నాయకుడు, ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే, నగరానికి చెందిన మరో ఎమ్మెల్యే, కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన ఓ ఎంపీ, ఓ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుమారుడు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతల భూముల ఆక్రమణలను నిగ్గు తేల్చడానికి జారీ చేసిన జీవో 134కు కొనసాగింపుగా.. కొంగరకుర్దు వక్ఫ్ భూముల వ్యవహారంపై కూడా దృష్టి పెడితే అన్ని వాస్తవాలు బయటపడతాయని స్థానికులు అంటున్నారు.
నిజమైన రైతుల్ని పట్టించుకోని అధికారులు
వక్ఫ్ భూములుగా పేర్కొంటున్న వాటిల్లో నిజమైన రైతులు కొందరు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నారు. తోటలు కూడా పెంచుకుంటున్నారు. అయితే వారికి మాత్రం అధికారులు ఎలాంటి ఉపశమనం కలిగించడం లేదు. గెజిట్ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు కోరుతూ కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నా, ఆ భూములను 22ఏ నుంచి తొలగించకుండా రెవెన్యూ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఆ ఓఆర్‌సీలు నకిలీవి..నా సంతకాలు ఫోర్జరీ చేశారు: ఐఏఎస్ బాల మాయాదేవి
కొంగరకుర్దులోని భూములకు సంబంధించి 1995లో తాను రెండు ప్రొసిడింగ్స్‌కు సంబంధించి సంతకాలు చేసినట్లుగా పేర్కొంటున్న డాక్యుమెంట్లు నకిలీవని అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి బాల మాయాదేవి ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రొసీడింగ్స్ నంబర్ జె/2391/1992 తేదీ 10.07.1995, ప్రొసీడింగ్స్ నం.జె/2223/1992, తేదీ 05–08–1995 పేరుతో తన సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఆక్యుపెషనల్ రైట్స్ సర్టిఫికెట్లు (ఓఆర్‌సీ) సృష్టించారని వివరించారు. గత ఏడాది మే 28వ తేదీన ఆమె ఈ ఫిర్యాదు చేసినప్పటికీ.. దానిపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని విశ్వసనీయ సమాచారం.
మా భూమిపై నకిలీ ఓఆర్‌సీలు
కొంగరకుర్దు(ఏ) సర్వే నంబర్ 159లో 2.29 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అప్పటి నుంచి మేము కబ్జా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాం. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో మా పేర్లు వస్తున్నాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా మా భూమిపై నకిలీ ఓఆర్‌సీలు తయారు చేసి హెచ్‌ఎండీఏ నుంచి లే అవుట్ అనుమతి పొంది కాగితాలపైనే ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి.
– సంరెడ్డి కృష్ణారెడ్డి, రైతు
రికార్డుల్లో మా పేర్లే ఉన్నాయి..
మా కుటుంబం 1999లో సర్వే నంబర్లు 68, 69, 71, 72, 179లో 16 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అప్పటి నుంచి మేము సాగు చేసుకుంటున్నాం. రికార్డుల్లో మాపేర్లు ఉన్నాయి. అయితే కొంతమంది కబ్జారాయుళ్లు మా భూమికి సంబంధించి కొందరు నకిలీ వ్యక్తులను తెరపైకి తెచ్చి, డాక్యుమెంట్లను సృష్టించి ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మా భూమిపై నకిలీ ఓఆర్‌సీలు తెచ్చారు.ఆ భూమి లే అవుట్ చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. దీనిపై త్వరలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.
– జె.జనార్ధన్‌రెడ్డి, స్థానికుడు


