భద్రాచలంవద్ద క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
గోదావరి లంకలో చిక్కుకున్న 200 మంది కూలీలు
సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య నిలిచిన రాకపోకలు
భద్రాచలంటౌన్/చర్ల/ములుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద వస్తుండగా భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం అర్ధ రాత్రి 12గంటలకు 19.80 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం మధ్యాహ్నం 2గంటలకు 24.30 అడుగులకు చేరింది. ఆదివారం 40 అడుగులకు చేరే అవకాశం ఉందన్న అంచనాలతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు గోదావరి నదికి ఒక్కసారిగా వరద పెరగడంతో పనులకు వెళ్లిన సుమారు 200మంది కూలీలు లంకలో చిక్కుకు న్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మొగళ్లపల్లి, జీపీపల్లి, వీరాపురం, సీ.కత్తిగూడెం, లింగాపు రం, గొంపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతు లకు ఆయా గ్రామాల సమీపంలోని గోదావరి లంకల్లో వ్యవసాయ భూములున్నాయి. అందులో మిర్చి సాగు చేస్తుండగా, సుమారు 200మంది కూలీలను శనివారం ఉదయం మిర్చి నారు నాటేందుకు తీసుకెళ్లారు. వ్యవసా య కూలీలు లంకల్లోకి వెళ్లిన తర్వాత వారు వెళ్లిన దారి మధ్యలో కి.మీ.పొడవైన పాయలోకి వరద ముంచెత్తింది. దీంతో కూలీలు ఆందోళనకు గురై ఫోన్‌లో తమ బంధు వులకు తెలపగా, వారు స్థానిక అధికారులకు సమాచారం అందించారు.
ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ హుటాహుటీన వీరా పురం గోదావరి పాయ వద్దకు చేరుకుని స్థానికుల సహకా రంతో సహాయక చర్యలు చేపట్టారు. తేగడ, గొమ్ముగూడెం, లింగాల, జెట్టిగూడెం తదితర ప్రాంతాల్లో ఉన్న జాలర్లను రప్పించి పడవలతో వెళ్లి గోదావరి లంకల్లో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ములుగు జిల్లాలో గోదావరి వద్ద కూడా వరద క్రమేపీ పెరుగుతోంది. శనివారం వాజేడు మండలం పరిధిలోని టేకులగూడెం గ్రామ సమీపంలో రేగుమాకు ఒర్రె నుంచి 163 నంబర్ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
కొంగవాగు సమీపంలో మిరప చేలు పూర్తిగా మునిగిపోయాయి. కాగా, ఏటూరునాగారం మండలం రామన్న గూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం 13.8 మీటర్ల నీటి మట్టం నమోదైంది. తుపాకులగూడెం గ్రామ పరిధిలో గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి శనివారం సాయంత్రం వరకు క్రమక్రమంగా పెరుగుతూ 7,28,700 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దేవాదుల ఎత్తిపోతల వద్ద 82.20 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది.


