రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే
ప్రత్యేక భారీ వర్ష హెచ్చరికలు లేవు
అక్కడక్కడా జల్లులు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత వారం తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మేఘావృత పరిస్థితులు తగ్గడం, రాష్ట్రమంతటా పొడి వాతావరణం నెలకొంటుండడంతో ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. అంతకు ముందు రోజు(శుక్రవారం)ఉష్ణోగ్రతలతో పోలిస్తే...1.5 డిగ్రీ సెల్సియస్ నుంచి 6 డిగ్రీ సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 30 డిగ్రీల నుంచి 34.3 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36డిగ్రీల నుంచి 38డిగ్రీల మేర నమోదు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 33 డిగ్రీ సెల్సియస్ నుంచి 36డిగ్రీ సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. కాగా, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాల సీజన్ ముగుస్తుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది.
గుర్దాస్‌పూర్, చండీగఢ్, ముజఫర్‌నగర్, అలీగఢ్, ధోల్‌పూర్, ఉదయ్‌పూర్, డిసా, నలియా నుంచి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతోంది. అక్టోబర్ రెండో వారం కల్లా దేశవ్యాప్తంగా రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రానున్న నాలుగు రోజులకు తెలంగాణకు ప్రత్యేక భారీ వర్ష హెచ్చరికలు లేవని ఐఎండీ తెలిపింది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసింది.


