పాడైన పదార్థాలు.. ఎలుకలు.. బొద్దింకలు | Food safety norms missing in city restaurants | Sakshi
Sakshi News home page

పాడైన పదార్థాలు.. ఎలుకలు.. బొద్దింకలు

Sep 27 2026 5:00 AM | Updated on Sep 27 2026 5:00 AM

Food safety norms missing in city restaurants

నగర రెస్టారెంట్లలో కనిపించని ఆహార భద్రత నిబంధనలు

కూరగాయల్లో ఫంగస్‌.. జిడ్డుపట్టిన వంటపాత్రలు

అనుమానాస్పదంగా 21 ఆహార నమూనాలు

టీజీ సేఫ్‌ తనిఖీల్లో లోపాలు బట్టబయలు

20 చోట్ల తనిఖీలు.. 11 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్‌

6 సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్, 3 సంస్థలకు షోకాజ్‌ నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రఖ్యాతి­గాంచిన రెస్టారెంట్లలో ఆహార భద్రత ని­బంధ­నలు పాటించడం లేదని టీజీ సేఫ్‌ తనిఖీల్లో తేల్చారు. శనివారం గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, ప్రాంతాల్లో ప్రత్యే­కించి తనిఖీలు చేపట్టారు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడి 20 రెస్టారెంట్లను పరిశీలించగా.. కొన్ని చోట్ల బొద్దింకలు, ఎలుకలు, పాడైన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుర్తించారు. దీంతో 11 రెస్టారెంట్ల లైసెన్స్‌ రద్దు చేసినట్లు అధికా­రులు తెలిపారు. 

పరిశుభ్రత గగనమే..
రెస్టారెంట్ల వంటగదుల్లో పరిశుభ్రత గగనంగా మారింది. ఫుడ్‌ హ్యాండ్లర్లు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలేదు. కూరగాయల్లో ఫంగస్‌ కనిపించింది. ఆహారాన్ని సక్రమంగా నిల్వ చేయకపోవడం, రిఫ్రిజిరేటర్లలో వెజ్, నాన్‌వెజ్‌ పదార్థాలను కలిపి ఉంచడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణ సరిగా లేకపోవడం, జిడ్డుపట్టిన ఎగ్జాస్ట్‌లు, చిమ్నీలు, పొరలు ఊడిన గోడలు, పైకప్పులు, శుభ్రంగా లేని పాత్రలు కూడా తనిఖీల్లో బయటపడ్డాయి. అనుమానాస్పదంగా కనిపించిన 21 ఆహార నమూనాలను సేకరించారు. రామేశ్వరం కేఫ్, ఇష్టా, సాహిబ్స్‌ బార్బిక్యూ, పక్కా లోకల్, హోటల్‌ షాదాబ్, షా గౌస్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు జారీ చేయనున్నారు. మరో మూడు సంస్థలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి జరిమానాలు విధించనున్నామన్నారు.

11 రెస్టారెంట్లపై కొరడా
టీజీ సేఫ్‌ అధికారుల తనిఖీల్లో ఆహార భద్రత నిబంధనలు పాటించని 11 రెస్టారెంట్ల లైసెన్సులను రద్దు చేశారు. తక్షణం కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. లైసెన్స్‌ రద్దు అయిన రెస్టారెంట్లలో మోనాస్టరీ, శివానీ ది రెస్టారెంట్‌ అండ్‌ బార్, అల్‌ సబా, లక్కీ మల్టీకుయిజిన్, సాయిరాం మెస్, ఉడిపీస్‌ ఉపహార్, కోల్‌ స్పార్క్, కాంచీ కేఫ్, అంతెరా కిచెన్‌ అండ్‌ బార్, అమాహా తెలుగు కిచెన్‌ అండ్‌ బార్, ఫ్యూజన్‌ 9/అమ్నీషియా స్కైబార్‌ ఉన్నాయి. 

మోనాస్టరీలో బొద్దింకలు, ఎలుకల బెడదతోపాటు ఫంగస్‌ పట్టిన కూరగాయలు, పాడైన గుడ్లు, కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కోల్‌ స్పార్క్‌లో ఫంగస్‌ కనిపించిన 22 కిలోల వేరుశెనగలు, 25 కిలోల మిరియాలు, 8.9 కిలోల జీడిపప్పును అక్కడికక్కడే తొలగించారు. మరికొన్ని చోట్ల పాడైన కూరగాయలు, పురుగులు పట్టిన ముడిసరుకు, కాలం చెల్లిన పదార్థాలను పారబోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement