రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ! | Nalgonda Rupa Reddy Case Two Students Involve In Death | Sakshi
Sakshi News home page

రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!

Aug 19 2026 7:25 AM | Updated on Aug 19 2026 12:11 PM

Nalgonda Rupa Reddy Case Two Students Involve In Death

సాక్షి, నల్లగొండ: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె. రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 11న జరిగిన ఈ హత్యకు ముగ్గురు పదో తరగతి విద్యార్థులు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓ విద్యార్థి ప్రధాన నిందితుడిగా, మరో ఇద్దరు విద్యార్థులు అతడికి సహకరించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. రూపారెడ్డి హత్యకు విద్యార్థులు గంజాయి సేవించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కొద్ది రోజుల క్రితం కొందరు విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా రూపారెడ్డి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వారిని మందలించడంతో పాటు, వారు గంజాయి సేవిస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా రూపారెడ్డి వద్ద ఉన్నట్లు సమాచారం. దీంతో తమను ఎక్కడ బయటపెడతారోనన్న భయంతో విద్యార్థులు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో గ్లౌజులు, మాస్కులు ధరించి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన విద్యార్థులు.. కేవలం తొమ్మిది నిమిషాల్లోనే ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు రూ.4 లక్షల నగదును తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు 80 మందిని విచారించిన పోలీసులు.. కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థుల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు బుధవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. అయితే విద్యార్థుల ప్రమేయం, హత్యకు గల కారణాలు, నగదు చోరీకి సంబంధించిన అంశాలపై పోలీసుల అధికారిక ప్రకటన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement