సేవలు, విరాళాల పేరిట సైబర్ మోసాలు
ఓ ప్రైవేట్ పోర్టల్‌లో రూ.10 వేలు చెల్లించి మోసపోయిన భక్తుడు
నకిలీ పోర్టళ్లపై సైబర్ క్రైమ్‌కు ఆలయ అధికారుల ఫిర్యాదు
ఇటీవల ఓ భక్తుడు యాదగిరిగుట్ట స్వామివారి సేవల కోసం ఆన్‌లైన్‌లో ఓ ప్రైవేట్ పోర్టల్ ద్వారా రూ. 10,000 చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నాడు. తీరా ఆ టికెట్‌తో యాదగిరిగుట్ట కొండపైకి చేరుకొని తనకు స్వామివారి సేవలు అందించాలని అధికారులను కోరాడు. ఆ టికెట్‌ను పరిశీలించిన దేవస్థానం ఉద్యోగులు అది యాదగిరిగుట్ట అధికారిక టికెట్ కాదని, నకిలీదని తేల్చారు. బాధితుడి నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు స్వీకరించి ఆ ప్రైవేట్ సంస్థకు, పోర్టల్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు.
సాక్షి, యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పేరుతో వెలసిన అనధికారిక, ప్రైవేట్ వెబ్‌సైట్లు భక్తులను నిలువునా దోచుకుంటున్నాయి. స్వామివారి సేవలు, విరాళాల పేరిట ఈ నకిలీ సైట్లు ఆన్‌లైన్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా ఓ భక్తుడు ఇలాంటి ప్రైవేట్ పోర్టల్‌ను నమ్మి భారీగా డబ్బులు చెల్లించి మోసపోయిన ఘటన వెలుగుచూడటంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.
విరాళాలు, సేవల పేరిట దగా
యాదగిరిగుట్ట దేవస్థానం వెబ్‌సైట్‌ను పోలిన విధంగానే కొన్ని ప్రైవేట్ సంస్థలు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించాయి. వాటిని నిజమైనవిగా నమ్మి దేశ, విదేశాలకు చెందిన భక్తులు విరాళాలు, సేవల రుసుము చెల్లించి మోసపోతున్నారు. డబ్బు చెల్లించి రశీదులు పొందాక ఆ సొమ్ము దేవస్థానానికి చేరడం లేదని గ్రహించేసరికే సమయం మించిపోతోంది.
ఆ డబ్బును తిరిగి పొందడం క్లిష్టంగా మారుతోంది. మరోవైపు కొన్ని వెబ్‌సైట్లు డబ్బు వసూలు చేయకపోయినప్పటికీ పూజలు, దర్శన వేళలపై తప్పుడు సమాచారాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఉదయం 5:00 లేదా 5:30 గంటలకు జరిగే అభిõÙక సేవలను 4:30 గంటలకే అని పేర్కొనడం, ఇష్టానుసారంగా సేవల పేర్లు మార్చడం వల్ల దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గందరగోళానికి గురవుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు
1951 దేవాదాయ చట్టం నిబంధనలు, ప్రభుత్వ గెజిట్‌ల ప్రకారం ఈ క్షేత్రం రిజిస్టర్ అయి ఉంది. యాదాద్రి, యాదగిరిగుట్ట, యాదగిరి అనే పవిత్ర నామాలు పూర్తిగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికే వర్తిస్తాయి. అలాగే వైటీడీ పేరును కూడా ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. వాటిని ప్రైవేటు లావాదేవీలకు లేదా వెబ్‌సైట్లకు వాడుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధం. దేవస్థానం అనుమతి లేకుండా ఈ పేర్లతో డొమైన్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
పోలిక ఉన్న వెబ్‌సైట్లను తక్షణమే తొలగించాలి
యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో నకిలీ వెబ్‌సైట్ల ముసుగులో జరుగుతున్న మోసాలపై తీవ్రంగా స్పందిస్తున్నాం. యాదాద్రి పేరు, వైటీడీ అధికారిక ముద్రలను పోలి ఉండే డొమైన్లతో వెబ్‌సైట్లను నడుపుతున్న సంస్థలను గుర్తించి నోటీసులు జారీ చేశాం. ఈ పేర్లను ఉపయోగించడానికి ఇతరులకు చట్ట ప్రకారం హక్కు లేదు. కాబట్టి ఆ పేర్లను, పోలికలను తక్షణమే తొలగించాలని లేదా మార్చుకోవాలని స్పష్టం చేశాం. స్వామివారి సేవలు, దర్శన టికెట్లు, పూజలు లేదా విరాళాల కోసం అధికారిక దేవస్థానం వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలి. ఆన్‌లైన్ చెల్లింపులు చేసే ముందు వెబ్‌సైట్ అడ్రస్ సరిగ్గా ఉందో లేదో భక్తులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. – భవానీ శంకర్, ఆలయ ఈవో
నకిలీ సైట్లపై ఫిర్యాదు.. అధికారిక వెబ్‌సైట్ ఇదే
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి https://yadagiriguttatemple.telangana.gov.in మాత్రమే ఏకైక అధికారిక వెబ్‌సైట్. దేవస్థానం వెబ్‌సైట్‌ను పోలిన ప్రైవేటు పోర్టళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు, తెలంగాణ ఐటీ విభాగానికి, కేంద్ర ఎన్‌ఐసీకి ఆలయ అధికారులు లేఖలు రాశారు. ఇప్పటికే ఉన్న నకిలీ సైట్లను రద్దు చేయించేందుకు తగిన ఆధారాలను ఆయా విభాగాలకు సమరి్పంచారు. భవిష్యత్తులో యాదగిరిగుట్ట, వైటీడీ పేర్లతో ఎవరైనా కొత్త డొమైన్ నమోదు చేసుకోవాలంటే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) అధికారిక అనుమతి, రాజముద్ర తప్పనిసరి చేసేలా నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


