సాక్షి,హైదరాబాద్: ఖైరతాబాద్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు, విజయారెడ్డి ఎన్నికల పిటిషన్, ఉపఎన్నికల చర్చల నేపథ్యంలో దానం నాగేందర్ తాజాగా స్పందించారు.
అఫిడవిట్ అంశం కారణంగా నేను డిస్‌క్వాలిఫై కాలేదు. మరో పార్టీ తరఫున పోటీ చేయడం వల్లే అనర్హత వేటు పడింది. ఇలాంటి పరిణామాలు వస్తాయని నాకు ముందే తెలుసు. పార్టీ నిర్ణయం మేరకే పోరాటం చేశా. విజయారెడ్డి వేసిన పిటిషన్‌పై గతంలోనే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు గుర్తు చేశారు.
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేరే పార్టీ తరఫున పోటీ చేయడం తదితర పరిణామాలతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మరోవైపు, ఎన్నికల సమయంలో దానం నాగేందర్ అఫిడవిట్‌లో సరైన సమాచారం ఇవ్వలేదంటూ విజయారెడ్డి గతంలోనే హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దానం ఎన్నిక రద్దయితే తనను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆమె కోరుతున్నారు.ఈ పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నిర్వహించ వద్దని కోర్టును ఆశ్రయించారు. దీనిపై రాజకీయంగా ఎంతో ఉత్కంఠ నెలకొన్న వేళ.. దానం నాగేందర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


