హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై మరో ఆర్థిక భారం పడనుంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు, ఆదాయ ట్రూ-అప్ మొత్తాల్లో రూ.7,635.22 కోట్లను టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ ద్వారా వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) మార్గాన్ని ఖరారు చేసింది.
ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రైతుల నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వం నుంచి రాబట్టాలని ఆదేశించింది. మిగిలిన రూ.5,420.23 కోట్లను ఇతర అర్హత కలిగిన విద్యుత్ కనెక్షన్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది.
టీజీఈఆర్సీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు రఘు కంచర్ల, చెరుకూరి శ్రీనివాసరావులతో కూడిన కమిషన్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వుల్లో వసూలు విధానాన్ని తరువాత నిర్ణయిస్తామని పేర్కొన్న కమిషన్.. తాజా ఉత్తర్వులతో ఆ విధానాన్ని ఖరారు చేసింది.
రూ.7,635 కోట్ల ట్రూ-అప్
2022-23 సంవత్సరానికి విద్యుత్ కొనుగోలు ట్రూ-అప్ కింద రూ.5,186.29 కోట్లు నిర్ణయించారు. ఇందులో టీజీఎస్‌పీడీసీఎల్ వాటా రూ.3,329.97 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్ వాటా రూ.1,856.32 కోట్లు. 2023-24 సంవత్సరానికి ఆదాయ ట్రూ-అప్ రూ.2,448.93 కోట్లు కాగా.. టీజీఎస్‌పీడీసీఎల్‌కు రూ.2,335.45 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్‌కు రూ.113.48 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రెండు డిస్కంలకు కలిపి రూ.7,635.22 కోట్లుగా తేలింది.
రైతులపై భారం లేదు
వ్యవసాయ రంగానికి సంబంధించి రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.2,214.99 కోట్ల ట్రూ-అప్ ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. ఇందులో టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో రూ.1,442.49 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలో రూ.772.50 కోట్లు ఉన్నాయి. ఉచిత విద్యుత్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. బదులుగా ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు డిస్కంలు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
నవంబర్ నుంచే వసూళ్లు
ఇతర కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన రూ.5,420.23 కోట్లలో టీజీఎస్‌పీడీసీఎల్ వాటా రూ.4,222.93 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్ వాటా రూ.1,197.30 కోట్లు. ఈ వసూళ్లు 2026 నవంబర్‌లో జారీ చేసే కరెంట్ బిల్లుల నుంచే ప్రారంభం కానున్నాయి.
మొదటి నెలలో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత నెలల నుంచి యూనిట్‌కు 50 పైసలు చొప్పున ట్రూ-అప్ రికవరీ చేయాలని కమిషన్ నిర్ణయించింది. వినియోగదారుడి 2022-23, 2023-24 సంవత్సరాల వినియోగాన్ని ఆధారంగా చేసుకుని నెలవారీ బిల్లింగ్ పరిమాణాన్ని నిర్ణయిస్తారు.
29 నెలలు.. 26 నెలలు
టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో 29 బిల్లింగ్ నెలలు, టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలో 26 బిల్లింగ్ నెలల్లో ఈ మొత్తాన్ని రాబట్టేలా కమిషన్ వ్యవధిని నిర్దేశించింది. అయితే ఏ వినియోగదారుడి నుంచి అయినా అతని 2022-23, 2023-24 సంవత్సరాల వినియోగానికి సంబంధించిన ట్రూ-అప్ మొత్తాన్ని మించి వసూలు చేయరాదని స్పష్టం చేసింది.
బిల్లులో ప్రత్యేకంగా చూపాలి
ట్రూ-అప్ ఛార్జీని సాధారణ విద్యుత్ బిల్లులో కలిపేయకుండా ప్రత్యేక అంశంగా చూపించాలని టీజీఈఆర్సీ ఆదేశించింది. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం, ఎంత నెలవారీ వినియోగంపై లెక్కించారో, ఏ రేటును వర్తింపజేశారో బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి. ఒక బిల్లింగ్ నెలలో రెండు ఆర్థిక సంవత్సరాల రికవరీ ఉంటే.. రెండింటినీ విడివిడిగా చూపాలి.
మొదటి ట్రూ-అప్ ఛార్జీ బిల్లు జారీకి ముందు టీజీడిస్కంలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఒక్కో విస్తృత ప్రచారం ఉన్న దినపత్రికలో నోటీసు ఇవ్వాలని కూడా కమిషన్ ఆదేశించింది. వసూలు విధానం, రేటు, వ్యవధిని అందులో వివరించాలి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో..
ట్రూ-అప్ వసూళ్ల నిర్ణయం తీసుకునేటప్పుడు సుప్రీంకోర్టు, ఏపిటీఈఎల్ ఇచ్చిన మార్గదర్శకాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. టారిఫ్ సాధ్యమైనంత వరకు వ్యయానికి అనుగుణంగా ఉండాలని, రెగ్యులేటరీ ఆస్తుల భారం పరిమితంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న రెగ్యులేటరీ ఆస్తులను గరిష్ఠంగా నాలుగేళ్లలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆదేశాలను ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.
మొత్తానికి.. నవంబర్ నుంచి కరెంట్ బిల్లుల్లో కొత్త ట్రూ-అప్ ఛార్జీ కనిపించనుంది. వ్యవసాయ వినియోగదారులకు మాత్రం ప్రత్యక్ష భారం లేకుండా రూ.2,214.99 కోట్లను ప్రభుత్వం నుంచి రాబట్టే విధానాన్ని కమిషన్ ఖరారు చేసింది. మిగిలిన రూ.5,420.23 కోట్ల భారం ఇతర అర్హత కలిగిన వినియోగదారులపై పడనుంది
ఇదీ చదవండి: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్


