రైలు ప్రయాణంలో సమస్యా?.. ఉందిగా రైల్ మదద్! | Facing Problems on a Train Use Rail Madad to File a Complaint | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణంలో సమస్యా?.. ఉందిగా రైల్ మదద్!

Aug 18 2026 1:59 PM | Updated on Aug 18 2026 2:20 PM

Facing Problems on a Train Use Rail Madad to File a Complaint

సాధారణంగా రైలు ప్రయాణం సాఫీగా సాగుతుందని అనుకుంటాం. కానీ.. కోచ్‌లో ఏసీ పనిచేయకపోవడం, శుభ్రత లేకపోవడం, సిబ్బంది నుంచి ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలు వస్తే ప్రయాణం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి.. సమయంలో ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్‌కి చెందిన రైల్ మదద్ (Rail Madad) ద్వారా మీ సమస్యను ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు.

రైల్ మదద్ గురించి
రైల్ మదద్ అనేది రైళ్లు, రైల్వే స్టేషన్లకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసేందుకు ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇందులో ప్రయాణానికి సంబంధించిన వివరాలు, సమస్య ఏంటో నమోదు చేయడంతో పాటు అవసరమైతే ఫొటోలు, వీడియోలు కూడా జత చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాంతో మీ కంప్లైంట్ పరిస్థితి ఏంటో కూడా తర్వాత తెలుసుకోవచ్చు.

ఫిర్యాదు ఎలా చేయాలి?
ముందుగా అధికారిక రైల్ మదద్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేసి ట్రైన్ కంప్లైంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీతో వెరిఫై చేయాలి. తరువాత పీఎన్ఆర్ నెంబర్, రైలు నెంబర్, ఎక్కే స్టేషన్, గమ్యస్థానం, కోచ్, బెర్త్ లేదా సీటు నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఇవన్నీ కరెక్ట్‌గా ఇవ్వడం వల్ల రైల్వే అధికారులు సమస్య ఎక్కడ ఉందో సులభంగా గుర్తించగలరు.

సమస్యను క్లియర్‌గా చెప్పండి
మీకు ఎదురైన సమస్యకు సరిపోయే కేటగిరీని ఎంచుకుని, సమస్యను వివరంగా రాయాలి. ఉదాహరణకు కోచ్ శుభ్రంగా లేకపోతే ఏ కోచ్‌లో, ఏ ప్రాంతంలో సమస్య ఉందో స్పష్టంగా చెప్పడం మంచిది. సమస్యకు సంబంధించిన ఫొటో లేదా వీడియో ఉంటే దాన్ని కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం PDF, JPG, JPEG, PNG, MP4 వంటి ఫైళ్లను అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది. ఒక్కో ఫైల్ పరిమాణం 5 MB వరకు ఉండొచ్చు.

కంప్లైంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
ఫిర్యాదు సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే కంప్లైంట్ రిఫరెన్స్ నెంబర్‌ను ద్వారా.. రైల్ మదద్‌లోని 'ట్రాక్ యువర్ కన్సర్న్' ఆప్షన్ ఎంచుకుని స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ రిఫరెన్స్ నెంబర్ ఉపయోగపడుతుంది.

ఎలాంటి సమస్యలకు ఫిర్యాదు చేయొచ్చు?
రైలు లేదా రైల్వే స్టేషన్‌లో ఎదురయ్యే వివిధ సమస్యలను రైల్ మదద్‌ ద్వారా తెలియజేయవచ్చు. కోచ్‌లో శుభ్రత లేకపోవడం, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన సమస్యలు, కోచ్‌లోని కొన్ని సదుపాయాలు పనిచేయకపోవడం వంటి అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు. సమస్యను బట్టి సరైన కేటగిరీని ఎంచుకుని వివరాలు ఇవ్వాలి.

అత్యవసర పరిస్థితుల్లో ఇలా..
అయితే.. భద్రత లేదా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఉంటే ఆన్‌లైన్ ఫిర్యాదు కోసం వేచి చూడకుండా.. వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ 139కు కాల్ చేసి సహాయం కోరాలి. ప్రయాణ సమయంలో తక్షణ భద్రత లేదా వైద్య సహాయం అవసరమైనప్పుడు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement