వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు.. భారీ వర్షాలు.. ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముందస్తు సమాచారం లేకుండా వర్షాలు కురుస్తున్నాయంటూ ఇంద్ర దేవుడిపైనే ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయికి చెందిన సూరజ్ తివారీ.. ఇంద్రుడి ఫోన్ నంబర్ తనకు తెలియదని.. కాబట్టి జిల్లా కలెక్టర్ దైవిక మార్గాల్లో ఆయనకు సూచనలు చేసి వర్షాలను ఆపించాలని కోరుతూ జన్‌సున్‌వాయి పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘‘కొన్నిసార్లు భారీగా.. మరికొన్నిసార్లు మెల్లగా కురుస్తున్న వర్షం సాధారణ ప్రజల జీవితాలను పూర్తిగా అస్తవ్యస్తం చేస్తోంది. ఇంద్రదేవుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిరంతరం వర్షాలు కురిపిస్తూ, ప్రజలను అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వర్షాల కారణంగా రోడ్లు, వీధులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయని ఆయన తెలిపారు. రైతులు తమ పంటల విషయంలో కొత్త ఆందోళనలను ఎదుర్కొంటున్నారని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం కూడా కష్టంగా మారిందని, రోజువారీ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు’’ అంటూ సూరజ్ తివారీ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే, తన ఫిర్యాదులోని చివరి అభ్యర్థనను జిల్లా కలెక్టర్‌కు ఉద్దేశిస్తూ తివారీ ఇలా రాశాడు.. “ఇంద్రదేవుడి మొబైల్ నంబర్ నాకు తెలియదు. కాబట్టి జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని.. తన దైవిక సమాచార మార్గాల ద్వారా ఇంద్రుడికి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి.. వెంటనే వర్షాలను నియంత్రించేలా చూడాలి.
..తద్వారా జిల్లా ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నా.. ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని ప్రభుత్వ వ్యవస్థపై వ్యంగ్యంగా చేసిన ఫిర్యాదుగా భావిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హర్దోయితో పాటు పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: Video: పామును ఎలా కాపాడారో చూస్తే షాక్ అవుతారు!


