మూడు గోల్ఫ్ బంతులను మింగేసిన ఓ పాము.. వైద్యులనే అవాక్కయ్యేలా చేసింది. శస్త్రచికిత్స లేకుండానే మత్తుమందు ఇచ్చి, పాము శరీరాన్ని జాగ్రత్తగా మానిప్యులేట్ చేస్తూ మూడు బంతులను బయటకు తీశారు అమెరికా పశువైద్యులు. ఈ అసాధారణ రెస్క్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో సౌత్ టెక్సాస్ ఏవియన్, ఎక్సయోటిక్ ఆసుపత్రిలో పాము కడుపులో ఇరుక్కుపోయిన మూడు గోల్ఫ్ బంతులను విజయవంతంగా బయటకు తీశారు.
ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియోను ఆసుపత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. వీడియోలో మత్తుమందు ఇవ్వడంతో పాము నిద్రలోకి జారుకుంది. అనంతరం వైద్యులు దాని శరీరంలో ఉన్న వస్తువులను ఎంతో జాగ్రత్తగా బయటకు తీసేశారు. ‘‘ఈ పాము మూడు గోల్ఫ్ బంతులను మింగింది. అదృష్టవశాత్తూ శస్త్రచికిత్స అవసరం రాలేదు. పాముకు మత్తుమందు ఇచ్చిన తర్వాత.. మా పశువైద్య బృందం దాని శరీరాన్ని జాగ్రత్తగా మలచుతూ మూడు గోల్ఫ్ బంతులను చేతులతో సురక్షితంగా బయటకు తీయగలిగింది.
ఇది నిజంగా గుర్తుండిపోయే కేసు.. ఎగ్జాటిక్ యానిమల్ మెడిసిన్‌లో తమ వద్దకు ఎలాంటి కేసు వస్తుందో ఎప్పుడూ ఊహించలేం’’ అంటూ ఆసుపత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. పశువైద్యులు పాము శరీరాన్ని నెమ్మదిగా మానిప్యులేట్ చేస్తూ గోల్ఫ్ బంతులను దాని నోటి వైపు కదిలించారు.
ఇదీ చదవండి: నీటిపై తేలుతున్న డ్రమ్ములో షాకింగ్ దృశ్యం
ఒక్కో బంతి నోటి దగ్గరకు చేరుకున్నప్పుడు పాము నోరు తెరవడంతో వైద్యులు వాటిని జాగ్రత్తగా బయటకు తీశారు. మొదటి గోల్ఫ్ బంతిని బయటకు తీసిన తర్వాత.. పామును పరీక్షించగా దాని శరీరంలో ఇంకా రెండు బంతులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్యులు అదే జాగ్రత్తతో మిగిలిన రెండు గోల్ఫ్ బంతులను కూడా బయటకు తీశారు.


