సీపీకి ఆధారాలిచ్చాం.. లోకేశ్‌పైనా రౌడీషీట్‌ తెరవాల్సిందే!: అంబటి | YSRCP Leaders To Meet Vijayawada CP, Seek Withdrawal Of Cases Filed During DSC Protest, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

సీపీకి ఆధారాలిచ్చాం.. లోకేశ్‌పైనా రౌడీషీట్‌ తెరవాల్సిందే!: అంబటి

Sep 26 2026 12:51 PM | Updated on Sep 26 2026 3:48 PM

YCP to Vijayawada CP: Ambati Demands Rowdy Sheet Against Lokesh

సాక్షి, విజయవాడ: డీఎస్సీ నిరసన సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తేయాలని ఆ పార్టీ నేతలు నగర పోలీస్‌ కమిషనర్‌ను కలిశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు బృందాలుగా శుక్రవారం విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు వెళ్లి.. సీపీ రాజశేఖర్‌బాబుకు తమ వద్ద ఉన్న ఆధారాలతో వినతిపత్రం అందించారు. డీఎస్సీ ఆందోళనలో జరిగిన ఘటనలకు సంబంధం లేని వారిపైనా కేసులు పెట్టారని ఈ సందర్భంగా వారు సీపీ దృష్టికి తీసుకెళ్లారు.

ఫిర్యాదు అనంతరం మాజీ మంత్రి, గుంటూరు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ నిరసన సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు మితిమీరిన చర్యలకు పాల్పడ్డారని అన్నారాయన. ‘అక్రమ కేసుల వ్యవహారంపై సీపీని కలిసేందుకు వచ్చాం. మా నేతలు లెక్కలేనంత మందిపై కేసులు బనాయించారు. ఎక్కడికి రావాలో చెబితే అక్కడికి వచ్చిన విచారణకు హాజరవుతామని, అంతేగానీ ఇళ్ల మీదకు రావొద్దని విజ్ఞప్తి చేస్తూ పోలీసులకు ఓ వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం అని అంబటి వ్యాఖ్యానించారు.

‘‘విజయవాడలో మల్లాది విష్ణు ధర్నా చేస్తే దాడి చేశారు. దాడి చేసిన వారిపై ఒక్క కేసైనా పెట్టారా? కోడిగుడ్లతో దాడి చేసిన టీడీపీ వారిపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. డీఎస్సీ నిరసనల విషయంలోనూ అంతే’’ అని ఆయన అన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి చివరకు అభాసుపాలవుతున్నారని విమర్శించారు.

‘పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలి’
కోర్టులు అక్షింతలు వేసినా పోలీసుల తీరు మారడం లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కేసులు పెట్టడం సరికాదని అన్నారు. డీఎస్సీ నిరసనకు సంబంధించిన కేసుల్లో సెక్షన్‌ 307 పెట్టారని.. అలాగే ఎస్సీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసులు పెట్టడం ఆశ్చర్యకరమని అన్నారాయన. 

గాదె సాయికృష్ణ కేసును కూడా అంబటి ప్రస్తావించారు. ఈ కేసులో పోలీసులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని తేల్చేశారాయన. 

మా గురి లోకేష్ రాజీనామా వైపే.. ఎన్ని కేసులు పెట్టిన We Don't Care

‘లోకేశ్‌పై కూడా రౌడీషీట్‌ పెట్టాలి’
మంత్రి నారా లోకేశ్‌పై కూడా అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉండాలని, ప్రజాప్రతినిధులపై రౌడీషీట్లు తెరవడం ఏ ప్రాతిపదికన జరుగుతోందని ప్రశ్నించారు. మంత్రి లోకేశ్‌పై మాముళ్ల దందా నడిపిస్తున్నారని.. ఆయనపై కూడా రౌడీషీట్‌ పెట్టాలని అంబటి అన్నారు. 

పోలీసులు సివిల్ వార్ కోరుకుంటున్నారా?: ఎమ్మెల్సీ యేసురత్నం
మేం ముందుగా చెప్పి నిరసనకు వస్తే అసలు వాళ్లకు(టీడీపీ నేతలకు) ఎలా అనుమతి ఇచ్చారు. ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటుంది.. రేపు మరొకటి వస్తుంది. పోలీసులు పొలిటికల్ పార్టీల ఉచ్చులో పడొద్దు. పోలీసులు అంతర్యుద్ధం కోరుకుంటున్నారా? ఎలాంటి కేసులు పెట్టాలో వాళ్లకు తెలియదా ?. ఎవరి ప్రోద్బలంతోనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెడితే మీరే సమాధానాలు చెప్పాలి. యూనిఫారం వేసుకుని ఇలాంటి తప్పులు చేయవద్దు. అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ యేసురత్నం హితవు పలికారు. 

చంద్రబాబు, లోకేష్ డీఎస్సీ విషయంలో చేసిన తప్పులు బయటపడ్డాయి. తప్ప చేశామని ఒప్పుకోవాలి.. ఆ శాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలి. దౌర్జన్యంతో డీఎస్సీ అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీ అధ్వర్యంలో జరిగిన డీఎస్సీ లో ఏం చేశారో అందరికీ అర్థమైంది. మేం తప్పు చేయలేదంటే సీబీఐ విచారణ చేయించుకుని కడిగిన ముత్యంలా బయటకు రండి. సాయికృష్ణ ఉదంతంలో పోలీసులను సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. అసలు గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఊచకోతల వల్లే అట్రాసిటీ చట్టం వచ్చింది. తిరిగి ఆ చట్టాలు మామీద ప్రయోగం చేస్తున్నారు. దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికల్లో మామీద పోతే చేసి గెలవాలి. వ్యవస్థల్ని ధ్వంసం చేయాలి అనుకుంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. 

పోలీసులు పక్షపాత వైఖరితో ముందుకు వెళ్తుంది. మా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లిన మా పార్టీ నేతలను తీసుకువెళ్తున్నారు. ఆరోజు నిరసన కార్యక్రమాన్ని పోలీసు డ్రోన్లు మొత్తం పర్యవేక్షించాయి. నాపైన కేసులు పెట్టిన వారిపై దాడి చేసి ఉంటే ఆ కేసులు బయటపెట్టాలి. మా నిరసన దగ్గరకు అసలు టీడీపీ వాళ్ళు ఎలా వచ్చారు. మాపైన దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. డీఎస్సీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ వాళ్ళతో మాపై దాడి చేయించారు. మేం అడుగుతుంది ఒక్కటే డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాలి.. లోకేష్ రాజీనామా చేయాలి. నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరు ఫైనల్ గా కేసుల్లో ఉన్నవారి లిస్ట్ ఇవ్వండి.. అందరం స్టేషన్ దగ్గరకు వస్తాం. పోలీసులు మీ తీరు మార్చుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అల్టిమేటం జారీ చేశారు. 

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై విచారణ కోరుతూ సెప్టెంబర్‌ 21న విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. ఆ సందర్భంగా టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దుర్మార్గంగా దాడులు జరిపారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలపైనే ఆశ్యర్యకరరీతిలో భారీగా కేసులు నమోదు కావడం కొసమెరుపు.

ఇదీ చదవండి: పాత బండ్లకు కొత్త స్టిక్కర్లు.. ఓరీ నీ బిల్డప్‌ తగలేయ్యా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement