breaking news
Automatic doors closed system
-
థానే లోకల్ ట్రైన్ ప్రమాదం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
ప్రయాణికులకు నిత్యనరకం అనేది ఎలా ఉంటుందో.. ముంబై లోకల్ ట్రైన్ల రద్దీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా రైలు ప్లాట్‌ఫారమ్ మీదకు రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడిపోవడం, ఫుట్‌బోర్డు మీద వేలాడుతూనే ప్రయాణాలు చేయడం తరచూ సోషల్ మీడియాలోనూ చూస్తుంటాం. అయితే థానేలో ఇవాళ జరిగిన ఘోర ప్రమాదంతో(Thane Local Train Accident) రైల్వే అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. లోకల్ ట్రైన్స్‌కు కూడా ఆటోమేటిక్ తలుపులు బిగించాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. థానేలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు కొత్త రైళ్లకూ ఈ తరహా డోర్లు బిగించనున్నట్లు తెలుస్తోంది. ముంబయి సబర్బన్ ప్రాంతంలో నడిచే అన్ని రైళ్లకూ ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల భద్రతే రైల్వే ప్రథమ ప్రాధాన్యం అని ఆయన పేర్కొన్నారు. థానేలో ఇవాళ ఉదయం కసారా వైపు వెళ్తున్న లోకల్ ట్రైన్ నుంచి పది మంది కింద పడిపోయారు. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికుల బ్యాగులు పరస్పరం తాకడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోవైపు.. ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం దర్యాప్తు చేస్తోందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నారు. ఇదీ చదవండి: బస్సు ప్రయాణికులకు బిగ్ షాక్ -
త్వరలో ‘ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్డ్ సిస్టమ్’ లోకల్ రైళ్లు
సాక్షి, ముంబై: ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్డ్ సిస్టమ్స్ లోకల్ రైళ్లు త్వరలో నగర వాసులకి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే వారం ప్రయోగాత్మకంగా ఒక బోగీని ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న లోకల్ రైలుకు ఈ బోగీని అమర్చనున్నారు. అయితే తేదీ ఇంకా ఖరారు చేయలేదని పశ్చిమ రైల్వే ప్రజా సంబంధాల అధికారి శరద్ చంద్రాయన్ వెల్లడించారు. రద్దీ సమయంలో నడుస్తున్న లోకల్ రైళ్లలోంచి ప్రయాణికులు కిందపడి మరణించడం, గాయపడటం లాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఫుట్ బోర్డుపై ప్రయాణించొద్దని మార్గదర్శక శిబిరాలు నిర్వహించినప్పటికీ మార్పు లేకపోవడంతో ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్డ్ సిస్టం ప్రవేశపెట్టాలని రైల్వే పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముంబైలోని మహాలక్ష్మి వర్క్ షాపులో 12 బోగీలతో కూడిన లోకల్ రైలుకు సాంకేతిక మార్పులు చేస్తున్నారు. వర్క్‌షాపులో నిర్వహించిన పరీక్షలు సఫలీకృతమవడంతో వచ్చేవారం ప్రయోగత్మకంగా ఒక ఖాళీ బోగీ నడపనున్నట్లు చంద్రాయన్ తెలిపారు. బోగీ కంట్రోల్ ప్యానెల్ మోటర్ గార్డు వద్ద ఉంటుందని, డోరు మూసుకున్నాకే రైలు కదులుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నగరంలోని లోకల్ రైళ్లకు ఇలాంటి డోర్లు అమర్చాలంటే సుమారు రూ. 1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 12 బోగీల ఒక్కో రైలుకు రూ. 4.5 కోట్లు ఖర్చవుతుందన్నారు.